హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న వేమూరి కావేరీ ట్రావెల్ బస్సు కర్నూలులో ప్రమాదానికి గురై 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడానికి డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రమాదానికి గురైన DD01N9490 నంబర్ గల బస్సు ట్రాఫిక్ నిబంధనలను ఏ స్థాయిలో ఉల్లంఘించిందో తెలుపుతూ ట్రాఫిక్ చలాన్లు వెలుగులోకి వచ్చాయి. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే ఈ బస్సుపై దాదాపు రెండేళ్లలో 16 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. ఈ ఉల్లంఘనల్లో ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ జరిమానాలు కూడా ఉన్నాయి.
ప్రమాదానికి గురైన బస్సుపై ఏకంగా ₹ 23,120 ట్రాఫిక్ జరిమానాలు ఉన్నట్లు వెల్లడైంది. ఇంత భారీ మొత్తంలో జరిమానాలు ఉండటం బస్సు డ్రైవర్లు, సిబ్బంది నిర్లక్ష్యానికి, యాజమాన్యం చూసీచూడనట్లు వ్యవహరించిన తీరుకు నిదర్శనమని నెటిజన్లు, విమర్శకులు మండిపడుతున్నారు. హైవేపై అతివేగంతో వెళుతున్న బస్సు రోడ్డుపై పడి ఉన్న బైక్ను ఢీకొట్టడం/ఈడ్చుకెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని, ఈ నిర్లక్ష్యమే ఇంతమంది ప్రాణాలను బలితీసుకుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఈ ఘటనపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, అనుమతులు లేకుండా నడిపే బస్సుల వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం తెలంగాణ, ఏపీ, కర్ణాటక రవాణా కమీషనర్ల సమావేశం ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ. 2 లక్షలు, గాయపడినవారికి రూ. 50 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించగా, తెలంగాణ ప్రభుత్వం మృతులకు రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.