తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గురువారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ నెల చివరి వారం నుంచి ఆమె జిల్లాల యాత్ర (జనం బాట) ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు అన్ని జిల్లాలను కలుపుకుంటూ కవిత ఈ యాత్ర చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు సంప్రదాయంగా స్వాగతం పలికి, మూల విరాట్‌ను దర్శించుకున్న అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి, ఆశీర్వచనం ఇచ్చారు.
ఈ సందర్భంగా కొత్త పార్టీ పెడతారా? అన్న అంశంపై కవిత మీడియా అడిగిన ప్రశ్నకు కీలక వ్యాఖ్యానించారు. “ప్రజలు కోరుకుంటే సమయం వచ్చినప్పుడు పార్టీ వస్తుంది” అని కవిత బదులిచ్చారు. ప్రస్తుతం ఆమె ప్రజల సమస్యలను అర్థం చేసుకునే లక్ష్యంతో ఉన్నామని, ఈ క్రమంలోనే ప్రతి జిల్లాలో ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు ‘జనం బాట’ పేరుతో యాత్ర ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. “అక్టోబర్ 25 నుంచి ఫిబ్రవరి 13 వరకు ప్రజలతో మమేకం అయ్యేందుకు చేపట్టబోయే తెలంగాణ జాగృతి ‘జనం బాట’ కార్యక్రమానికి నరసింహ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించాను” అని ఆమె ట్వీట్ చేశారు.
కాగా, ఈ ‘జనం బాట’ యాత్రలో కవిత బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫొటో లేకుండానే ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఆమె ప్రొఫెసర్ జయశంకర్ ఫొటోతో యాత్ర చేయాలని భావిస్తున్నారు. ఆయా అంశాలపై ఆమె ఇప్పటికే మేధావులు, వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకువస్తుందనేది ఆసక్తికరంగా మారింది.