ఈ దీపావళి పండగ సీజన్‌లో భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ (UPI) సరికొత్త రికార్డు సృష్టించింది. అక్టోబర్ 18న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 75.4 కోట్ల లావాదేవీలు జరిగాయని, వాటి మొత్తం విలువ రూ. 1.02 లక్షల కోట్లుగా నమోదైందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం వెల్లడించారు. ధంతేరస్ నుంచి దీపావళి మధ్య మూడు రోజుల పాటు సగటున రోజుకు 73.69 కోట్ల లావాదేవీలు జరిగాయని, ఇది గత నెలతో పోలిస్తే చాలా ఎక్కువ అని ఆమె వివరించారు.
ఈ రికార్డు స్థాయి లావాదేవీలకు ప్రధాన కారణం జీఎస్టీ (GST) రేట్ల తగ్గింపే అని ఆర్థిక మంత్రి తెలిపారు. జీఎస్టీ తగ్గింపు కారణంగా సామాన్యుల చేతిలో డబ్బు మిగలడం, వారి కొనుగోలు శక్తి పెరగడం వల్ల ఈ పండగకు అధికంగా కొనుగోళ్లు చేశారని ఆమె పేర్కొన్నారు. “జీఎస్టీ రేట్ల తగ్గింపు సామాన్యులకు ఎంతో మేలు చేసింది… దీనివల్ల ఈ ఏడాది రిటైలర్లకు నిజమైన దీపావళి వచ్చింది” అని ఆమె వ్యాఖ్యానించారు. కృత్రిమ వజ్రాల నుంచి దుస్తుల వరకు, గృహాలంకరణ వస్తువుల వరకు అన్ని విభాగాల్లోనూ అమ్మకాలు జోరుగా సాగినట్లు ఆమె పేర్కొన్నారు.
మరోవైపు, ఈ ఏడాది దీపావళి అమ్మకాలు కూడా ఆల్ టైమ్ రికార్డు సృష్టించాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) తెలిపింది. నవరాత్రుల నుంచి దీపావళి వరకు మొత్తం రూ. 6.05 లక్షల కోట్ల అమ్మకాలు జరిగాయని, ఇది భారత వాణిజ్య చరిత్రలోనే అత్యధికమని పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఇది 25 శాతం అధికం. మొత్తం అమ్మకాల్లో దాదాపు 85 శాతం వాటా సాధారణ రిటైల్ దుకాణాలదే కావడం గమనార్హం. తమ అమ్మకాలు పెరగడానికి జీఎస్టీ తగ్గింపే కారణమని సర్వేలో పాల్గొన్న 72 శాతం మంది వ్యాపారులు చెప్పడం విశేషం.