‘రూ. 2,700 కోట్ల బకాయిలతో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్’: ఏపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేటు ఆసుపత్రులలో సేవలు నిలిచిపోవడంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రైవేటు ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,700 కోట్ల బకాయిలు చెల్లించకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని ఆమె ఆరోపించారు. ఆరోగ్యశ్రీ చరిత్రలోనే ఇది ఒక చీకటి రోజు అని గురువారం ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) వేదికగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

గత 15 రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో లక్షలాది మంది రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని షర్మిల పేర్కొన్నారు. అత్యవసర సర్జరీలు సైతం ఆగిపోయి పేదలు నరకయాతన అనుభవిస్తున్నా, కూటమి ప్రభుత్వానికి మనసు కరగడం లేదని ఆమె విమర్శించారు. చేసిన వైద్యానికి బిల్లులు చెల్లించాలంటూ ఆసుపత్రులు రోడ్డెక్కడం అత్యంత విచారకరమని షర్మిల అన్నారు.

రాష్ట్రంలో ఇంత పెద్ద సంక్షోభం నెలకొన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మౌనంగా ఉండటం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమని షర్మిల దుయ్యబట్టారు. వైద్యం అందక ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వం చోద్యం చూడటం దారుణమని మండిపడ్డారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదని, పేదలకు అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసి, పూర్తిగా చంపేసే కుట్రలో భాగమేనని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *