తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) తీవ్ర విమర్శలు గుప్పించారు. అక్టోబర్ 23, 2025న తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ‘బలహీన ముఖ్యమంత్రి’ అంటూ ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ‘అవినీతి విలయతాండవం’ చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ‘గన్ కల్చర్’ (తుపాకీ సంస్కృతి), మంత్రుల అవినీతి, అధికారుల భయం, పోలీసు వ్యవస్థ దుష్ప్రవర్తనలు వంటి అంశాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
కేటీఆర్ ప్రకారం, కాంగ్రెస్ పాలనలో అవినీతి గ్రామ స్థాయి నుంచి సచివాలయం వరకు వ్యాపించింది. ‘ముఖ్యమంత్రి వేల కోట్లు సంపాదిస్తుంటే, మంత్రులు వందల కోట్లకు పోటీ పడుతున్నారు’ అని ఆయన విమర్శించారు. మంచిరేవుల భూముల వ్యవహారంలో తుపాకీలతో బెదిరించడం, టెండర్ల రిగ్గింగ్, కమిషన్ల పంచాయతీ వంటివి బయటపడ్డాయని, ఈ ఘటనలు రాష్ట్రంలో మాఫియా రాజ్యాన్ని స్థాపించాయనీ, ఇది ‘ఇందిరమ్మ రాజ్యం కాదు, దండుపాళ్యం ముఠా రాష్ట్రం’ అని ఆరోపించారు. అధికారులు కూడా భయపడి వాలంటరీ రిటైర్మెంట్ (వీఆర్‌ఎస్) తీసుకుంటున్నారని, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై తప్పుడు పనులు బలవంతం చేయడం వల్ల ఇది జరుగుతోందని ఆయన విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కేటీఆర్ తీవ్రంగా ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని **’రాజకీయ జీవితంలో చూడని బలహీన ముఖ్యమంత్రి’**గా విమర్శించారు. మంత్రుల అవినీతి ఆరోపణలకు ముఖ్యమంత్రి మౌనంగా ఉండటం సిగ్గుపడే తీవ్ర అంశమని అన్నారు. మంత్రి కొండా సురేఖ కుమార్తె వ్యవహారంలో, ‘స్వయంగా మంత్రి కుమార్తె ముఖ్యమంత్రి పాత్ర పోషించిందని ఆరోపణ’ ఉన్నా రేవంత్ మౌనం వహించారని విమర్శించారు. మంత్రులు ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేసినా చర్యలు తీసుకోలేకపోవటం, ఆ తర్వాత శాలువాలూ, స్వీట్లూ పంచుకోవడం ‘సెటిల్మెంట్’కు సంకేతమని, ముఖ్యమంత్రి ఇల్లు సెటిల్మెంట్ల కేంద్రంగా మారిపోయిందని కేటీఆర్ ఆరోపించారు. అలాగే, తెలంగాణలో ‘గన్ కల్చర్’ పెరిగిందని, పరిశ్రామికవేత్తలు, వ్యాపారులపై తుపాకీలతో బెదిరింపులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ విషయంలో పోలీసులు నిందితులపై సరైన చర్యలు తీసుకోవడం లేదని, పోలీసు యంత్రాంగంలో 1% మంది కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని నిందించారు.