మెగా ఫ్యామిలీకి శుభవార్త: రెండోసారి తల్లి కాబోతున్న రామ్ చరణ్ సతీమణి ఉపాసన

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల మరోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. దీపావళి వేడుకల్లో కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు హాజరైన సీమంతం (బేబీ షవర్) వేడుక వీడియోను ఉపాసన తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఈ వీడియోకు “ఈ దీపావళికి డబుల్ సెలబ్రేషన్స్, డబుల్ లవ్ అండ్ డబుల్ బ్లెస్సింగ్స్” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీపావళి సెలబ్రేషన్స్‌తో పాటు ఉపాసనకి సీమంతం కూడా చేసినట్లుగా ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కార్యక్రమానికి చిరంజీవి కుటుంబసభ్యులు, బంధువులంతా హాజరయ్యారు. ఉపాసన సంతోషకరమైన ఈ వార్తతో మెగా అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రామ్ చరణ్ మరియు ఉపాసనల వివాహం 2012లో జరగగా, వీరు 2023, జూన్‌లో తమ మొదటి సంతానంగా పండంటి పాపకు జన్మనిచ్చారు. ఆ చిన్నారికి ‘క్లీంకార’ అని నామకరణం చేశారు. ప్రస్తుతం క్లీంకార మొహాన్ని మెగా ఫ్యామిలీ రివీల్ చేయలేదు. తాజాగా ఉపాసన రెండోసారి గర్భం దాల్చినట్లు ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మెగా ఫ్యామిలీలోకి త్వరలోనే మరొక కొత్త మెంబర్ వస్తున్నారని, ఈసారి ‘సింబా’ వస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. తమకు ఈసారి మనవడు పుట్టాలని ఉందంటూ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ కార్యక్రమంలో తన మనసులోని కోరికను బయటపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి చరణ్‌, ఉపాసన దంపతులకి కచ్చితంగా అబ్బాయే పుడతాడని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఉపాసన ఒక ఇంటర్వ్యూలో రెండో సంతానం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మొదటి బిడ్డ విషయంలో చాలా ఆలస్యం చేశాం. అప్పట్లో విమర్శలను, ఒత్తిడిని నేను పట్టించుకోలేదు. అయితే రెండో బిడ్డ విషయంలో అలాంటి పొరపాటు చేయాలని అనుకోవడం లేదు. మా డాక్టర్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడే రెండోసారి బిడ్డకు జన్మనివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను” అని స్పష్టం చేశారు. రెండో బిడ్డను త్వరగానే కనడానికి సిద్ధంగా ఉన్నానని ఉపాసన చెప్పడంపై మెగా ఫ్యాన్స్ అప్పట్లో చాలా సంతోషించారు. తాజాగా దీపావళి సీమంతం వేడుక వీడియోను పంచుకోవడం ద్వారా ఉపాసన రెండోసారి గర్భం దాల్చినట్లు హింట్ ఇవ్వడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *