జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో తమను ఇంకా BRS పార్టీకి చెందినవారమని చెప్పుకుంటున్న కొందరు ఎమ్మెల్యేల పేర్లు కనిపించడంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖైరతాబాద్‌లోని బస్తీ దవాఖానాను సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, “ఏ పార్టీలో ఉన్నావంటే చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. సిగ్గు అనే పదం ఉన్నదా?” అంటూ పార్టీ మారిన ఎమ్మెల్యేలను, కాంగ్రెస్‌లోని అస్థిరత, అసమన్వయతను ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఉన్న అంతర్గత గందరగోళాన్ని బయటపెడుతోందని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీని “ఇది కాంగ్రెస్ కాదు, ఆలిండియా కరప్షన్ కమిటీ” అంటూ కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. ఆ పార్టీకి ఖర్గే, రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్నారని, దేశవ్యాప్తంగా అవినీతి, మోసం, రాజకీయ మాయాజాలం నడిపిస్తున్నది కాంగ్రెస్సేనని ఆయన ఆరోపించారు. ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి, చివరకు పరిపాలనలో అవినీతిని పెంచడమే కాంగ్రెస్ విధానంగా మారిందని ఆయన దాడి చేశారు. ఈ ఉప ఎన్నికల సందర్భంగా ప్రజలు కాంగ్రెస్ మాయలో పడకూడదని కేటీఆర్ పిలుపునిచ్చారు.
తెలంగాణలో కాంగ్రెస్ పాలన ప్రారంభమైనప్పటి నుంచి ప్రజల సమస్యలు పరిష్కార దిశగా కదలలేదని, అభివృద్ధి ఆగిపోయిందని కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల కంటే రాజకీయ ప్రతీకారాలపై దృష్టి పెట్టిందని ఆరోపించారు. మిషన్ భగీరథ, రైతు బంధు, బస్తీ దవాఖానాలు వంటి గత ప్రభుత్వ పథకాలను నిలిపివేయడం ప్రజావ్యతిరేక చర్య అని విమర్శించారు. తెలంగాణను అభివృద్ధి దిశగా కొనసాగించగలిగేది కేవలం BRS మాత్రమేనని, అందుకే ఈ ఉప ఎన్నికలో ప్రజలు ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలని కేటీఆర్ కోరారు