నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్‌ను హత్య చేసిన కేసులో రౌడీషీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్ ఘటనపై నిజామాబాద్ సీపీ సాయిచైతన్య కీలక విషయాలు వెల్లడించారు. సోమవారం ఉదయం రెగ్యులర్ చెకప్‌లో భాగంగా సిబ్బంది ఆర్ఐ వార్డు వద్దకు వెళ్లగా, రియాజ్ తలుపు, అద్దం పగులగొడుతున్న శబ్దం వినిపించింది. దీంతో వెంటనే సిబ్బందికి సమాచారం ఇవ్వగా, ఆర్ఐతో పాటు ఎస్సై, కానిస్టేబుల్ వార్డులోకి వెళ్లారు. రియాజ్ హంగామా సృష్టిస్తుండడంతో, అతడిని బెడ్ వద్దకు తీసుకెళ్లే క్రమంలో నిందితుడు ఒక్కసారిగా కానిస్టేబుల్ వద్దనున్న తుపాకీని లాక్కుని ట్రిగ్గర్ నొక్కే ప్రయత్నం చేశాడు.
ఆర్ఐ ఎంత వారించినా వినిపించుకోకుండా రియాజ్ ట్రిగ్గర్ నొక్కడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్ఐ నిందితుడిపై కాల్పులు జరిపారని సీపీ తెలిపారు. దీంతో నిందితుడు కుప్పకూలిపోయాడని ఆయన వివరించారు. ఈ ఎన్‌కౌంటర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, నిబంధనల ప్రకారం ఫార్మాలిటీస్‌ను నిర్వహిస్తున్నట్లు సీపీ తెలిపారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఆత్మరక్షణ కోసమే ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.
కాగా, రియాజ్ చేసిన దాడిలో ఆసిఫ్ అనే వ్యక్తికి గాయాలైన విషయం తెలిసిందే. ఆ బాధితుడిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించినట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న రియాజ్, ఈ విధంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే హింసాత్మక చర్యకు పాల్పడి ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.