ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తమ నివాసంలో సతీమణి నారా భువనేశ్వరితో కలిసి దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నిత్యం పార్టీ పనులు, రాజకీయ కార్యక్రమాలు, ప్రభుత్వ పనులతో తీరిక లేకుండా గడిపే సీఎం చంద్రబాబు, ఈ దీపావళి సందర్భంగా సరదాగా గడుపుతూ కనిపించారు. సీఎం దంపతులు తమ ఇంటిని దీపాలతో అలంకరించి, భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలను పూర్తి చేశారు.
పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సీఎం చంద్రబాబు, సతీమణి భువనేశ్వరితో కలిసి చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు కాల్చి దీపావళి సంబరాలను జరుపుకున్నారు. దీపాలు వెలిగించి, సంప్రదాయబద్ధంగా పండుగను ఆచరించిన సీఎం దంపతులు, ఈ సందర్భంగా సంతోషంగా గడిపారు. సతీమణి నారా భువనేశ్వరి కూడా ఉల్లాసంగా చిచ్చుబుడ్డి కాల్చారు.
దీపావళి సందర్భంగా సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. “దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ | దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోస్తుతే ||” అంటూ పరబ్రహ్మగా భావించే దీపాన్ని ఆరాధించే ఈ పవిత్ర దినం సందర్భంగా ప్రజలందరూ ఆనందంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు.