భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. ఆమె బాయ్‌ఫ్రెండ్ అయిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఫిల్మ్ ప్రొడ్యూసర్ పలాష్ ముచ్చల్ ఈ విషయాన్ని స్వయంగా ధృవీకరించారు. భారతదేశంలో జరుగుతున్న మహిళల ప్రపంచ కప్ 2025 సందర్భంగా ప్రస్తుతం ఇండోర్‌లో ఉన్న పలాష్ ముచ్చల్, స్థానిక మీడియాతో మాట్లాడుతూ తమ సంబంధాన్ని బహిరంగంగా అంగీకరించారు. ఇండోర్ స్టేట్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, “ఆమె (స్మృతి మంధాన) త్వరలో ఇండోర్ కోడలు కాబోతోంది. నేను చెప్పదలచుకున్నది అంతే… మీకు హెడ్‌లైన్ ఇచ్చేశాను!” అని ఉల్లాసంగా ప్రకటించారు.
ఇండోర్‌కు చెందిన పలాష్ మాటలతో, స్మృతి మంధాన త్వరలో ముచ్చల్ కుటుంబంలోకి అడుగుపెట్టబోతున్నట్లు స్పష్టమైంది. ఇంతకుముందు వీరిద్దరూ తరచుగా సోషల్ మీడియాలో కలిసి దిగిన ఫొటోలు పంచుకోవడం ద్వారా తమ బంధాన్ని హింట్‌గా చూపించినప్పటికీ, ఇది వారి పెళ్లిపై వచ్చిన మొదటి అధికారిక ధృవీకరణగా నిలిచింది. పలాష్ ముచ్చల్ వృత్తిపరంగా ‘డిష్కియాన్’, ‘భూతనాథ్ రిటర్న్స్’ వంటి చిత్రాలకు సంగీతం అందించారు. 30 ఏళ్ల పలాష్, స్మృతి మంధానా మధ్య 2019 నుంచి డేటింగ్ జరుగుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.
పలాష్ ముచ్చల్ తమ పెళ్లి గురించి ప్రకటిస్తూనే, తన ప్రేయసి స్మృతి మంధానాతో పాటు భారత మహిళల జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక స్మృతి మంధాన క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే, ఆమె ఇటీవల ఆస్ట్రేలియాపై జరిగిన వన్డేలో 66 బంతుల్లో 80 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. అదే మ్యాచ్‌లో వన్డే క్రికెట్‌లో 5000 పరుగుల మైలురాయిని కూడా చేరుకున్నారు. మైదానంలో విజయాలు సాధిస్తున్న ఈ స్టార్ బ్యాటర్, త్వరలో తన వ్యక్తిగత జీవితంలో మరో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. పెళ్లి తేదీ, వేదికకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడికాలేదు.