బీసీ బంద్‌తో నిలిచిన ఆర్టీసీ బస్సులు: దీపావళికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు చుక్కెదురు!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న బీసీ బంద్ ప్రభావం రవాణా వ్యవస్థపై తీవ్రంగా పడింది. బంద్ కారణంగా ఆర్టీసీ బస్సులు అన్నీ డిపోలకే పరిమితం కావడంతో, దీపావళి పండుగకు సొంతూళ్లకు వెళ్లాలని ప్రణాళిక వేసుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శని, ఆదివారాలు కలిసి రావడంతో మూడు రోజులపాటు ఇళ్లకు వెళ్లాలనుకున్న హైదరాబాద్‌తో పాటు వివిధ నగరాల్లోని ప్రజల ప్రయాణాలకు బంద్ కారణంగా ఆటంకం ఏర్పడింది.

సాధారణంగా బస్సులు, ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్‌లోని ముఖ్య బస్‌స్టాండ్‌లైన ఎంజీబీఎస్, జేబీఎస్ బస్‌స్టాండ్‌లు బంద్ కారణంగా బోసిపోయి కనిపించాయి. పండుగకు ఎలాగైనా ఇళ్లకు చేరుకోవాలనే పట్టుదలతో ఉన్న ప్రయాణికులు బస్‌స్టాండ్ల బయట బస్సుల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆర్టీసీ సేవలు నిలిచిపోవడంతో ప్రయాణికులకు మరో దారి లేక, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ బంద్ పరిస్థితిని ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ వాహనాల డ్రైవర్లు ప్రయాణికులను దోపిడీ చేస్తున్నారు. మామూలు ఛార్జీల కంటే రెండింతలు, కొన్నిసార్లు ఏకంగా నాలుగు రెట్ల వరకు ఛార్జీలు డిమాండ్ చేస్తున్నారు. ఉదాహరణకు, ఎల్బీ నగర్ నుంచి సూర్యాపేటకు మామూలు రోజుల్లో రూ. 200 ఉండే ఛార్జీని, ప్రైవేట్ కార్ల డ్రైవర్లు ఏకంగా రూ. 800 వరకు అడుగుతున్నారు. చేసేదేమీ లేక ప్రయాణికులు వారు అడిగినంత చెల్లించి సొంతూళ్లకు బయలుదేరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *