ప్రభాస్ మరియు మారుతి కాంబినేషన్లో రాబోతున్న ‘రాజాసాబ్’ సినిమా విడుదల తేదీ విషయంలో తాజాగా వినిపిస్తున్న వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మొదట్లో మారుతి దర్శకత్వంలో, హారర్-కామెడీ జానర్లో ప్రభాస్ నటించడంపై అభిమానులు కొంత నిరాశ చెందినా, సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్, వింటేజ్ ప్రభాస్ మాస్ సీన్స్‌తో కూడిన టీజర్, ట్రైలర్ వారిలో అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా కోసం ఆడియెన్స్‌లో ఎక్స్పెక్టేషన్స్ పీక్స్‌లో ఉన్నాయి. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు.
అయితే, ఈ సినిమా విడుదల తేదీ విషయంలో మాత్రం గందరగోళం కొనసాగుతూనే ఉంది. మొదట 2025 ఏప్రిల్ 11న రిలీజ్ చేయాలని ప్లాన్ చేయగా, గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో డిసెంబర్ 5, 2025కి వాయిదా పడింది. ఆ తర్వాత ప్రీ-రిలీజ్ బిజినెస్ కారణంగా జనవరి 9, 2026న విడుదల చేయాలని భావించారు. తాజాగా, మేకర్స్ సినిమాను న్యూ ఇయర్ రోజున, అంటే జనవరి 1, 2026న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఇన్సైడ్ టాక్.
ఈ సినిమాను సంక్రాంతి సీజన్ కంటే పది రోజుల ముందు విడుదల చేస్తే, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ చిత్రంతో పాటు ఇతర సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పోటీని తప్పించుకోవచ్చని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే, గతంలో ప్రీ-ఫెస్టివల్ సమయాల్లో విడుదలైన పవన్ కళ్యాణ్ ‘బాలు’, ఎన్టీఆర్ ‘ఆంధ్రావాలా’ వంటి సినిమాలు జనవరి 1న విడుదలైనప్పటికీ, వసూళ్ల విషయంలో డీలా పడ్డాయి. కాబట్టి, ఈ అంశాలన్నీ లెక్కలోకి తీసుకుని ‘రాజాసాబ్’ విషయంలో మేకర్స్ ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఈ పాన్ ఇండియా సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.