సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్, బీసీ రిజర్వేషన్లపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటన

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సింగరేణి కార్మికులకు శుభవార్త తెలిపారు. దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి బోనస్ ప్రకటించింది. దీపావళి కానుకగా రూ. 400 కోట్ల బోనస్‌ను అందిస్తున్నట్లు ఖమ్మంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దీపావళి బోనస్ ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

అదే సమావేశంలో, బీసీ రిజర్వేషన్ల అంశంపై మల్లు భట్టి విక్రమార్క కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కకుండా అడ్డుకున్నది బీజేపీ ప్రభుత్వమేనని ఆయన ఆరోపించారు. బీసీలకు రిజర్వేషన్ కల్పించడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి చిత్తశుద్ధి ఉందని ఆయన స్పష్టం చేశారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు కాపీ అందిన వెంటనే చర్చించి, ఈ నెల 23న జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ వైఖరి రాష్ట్ర ప్రజలకే కాదు, దేశం మొత్తానికి తెలిసిందని భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రం నుంచి అఖిలపక్షంగా రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని కలిసేందుకు పదేపదే లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ నెల 18న రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న బీసీ బంద్ నిరసన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అఖిలపక్ష పార్టీల నాయకులు ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, అందుకు ప్రయత్నించాలని కిషన్ రెడ్డిని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *