25 ఏళ్ల ఫోక్ సింగర్ మైథిలి ఠాకూర్‌కు బీజేపీ ఎమ్మెల్యే టికెట్

బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కళా ప్రపంచం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన ప్రముఖ ఫోక్ సింగర్ మైథిలి ఠాకూర్ (Maithili Thakur) బీజేపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. పార్టీ తాజాగా విడుదల చేసిన రెండో జాబితాలో అలీనగర్ నియోజకవర్గం నుంచి 25 ఏళ్ల మైథిలికి అవకాశం లభించింది. నిన్ననే అధికారికంగా బీజేపీలో చేరిన ఆమెకు, కళారంగంలో ఉన్న గుర్తింపు, ప్రజలతో ఉన్న అనుబంధం, యువతలో ఉన్న అభిమానాన్ని దృష్టిలో ఉంచుకొని పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మైథిలి ఠాకూర్ దేశవ్యాప్తంగా ఫోక్ మ్యూజిక్ ప్రియులకు సుపరిచితమే. చిన్న వయసులోనే పలు భాషల్లో పాటలు పాడి సోషల్ మీడియాలో విశేష ప్రజాదరణ పొందిన ఆమె, భారతీయ సాంప్రదాయ గీతాలకు ఆధునిక శైలిలో కొత్త జీవం పోశారు. మైథిలి హిందీ, భోజ్‌పురి, మైథిలి, బెంగాలీ, తమిళం, తెలుగుతో సహా అనేక భారతీయ భాషల్లో పాటలు పాడి అభిమానులను సంపాదించారు. సంప్రదాయ సంగీతాన్ని కొత్త తరాలకు చేరవేయడంలో ఆమె చేసిన కృషి ప్రశంసనీయమైంది.

ఇటీవల మైథిలి ప్రధానమంత్రి చేతుల మీదుగా ‘కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకోవడం ఆమె ప్రజాదరణకు నిదర్శనం. బిహార్ సాంస్కృతిక విలువలను ప్రపంచానికి పరిచయం చేసిన ఈ కళాకారిణి, ఇప్పుడు ప్రజా సేవ దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రకటించారు. అలీనగర్ ప్రజల్లో ఆమెకు ఉన్న అభిమానం, యువతలో ఉన్న ఆకర్షణ బీజేపీకి బలాన్నిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కళా ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మైథిలి విజయవంతమవుతారా అనే అంశం ఎన్నికల ఫలితాల్లో తేలనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *