ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. రాష్ట్రంలోని దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు, ఈశాన్య గాలులు వీస్తుండటం దీనికి కారణమన్నారు. అంతేకాక, కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దీని ప్రభావం కూడా ఉంటుందని వెల్లడించారు.
ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని హెచ్చరించారు. ఏలూరు, కృష్ణా, బాపట్ల, విజయనగరం, యానాం, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళవారం (14-10-2025) కూడా ఏలూరు (జి), బాపట్ల, విజయనగరం (జి), కృష్ణా (జి) వంటి ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది.
రాబోయే 2 రోజుల్లో దేశంలోని మిగిలిన ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు మరింత ఉపసంహరించుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, ఈశాన్య రుతుపవనాల వర్షపాతం కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు, ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, ఈ వాతావరణ మార్పుల దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.