పండగ ఆఫర్లతో సైబర్ నేరగాళ్ల వల: ఆన్‌లైన్ షాపింగ్‌లో జాగ్రత్త – సీపీ సజ్జనార్ హెచ్చరిక

పండగ సీజన్ సమీపిస్తుండటంతో ఆన్‌లైన్ షాపింగ్ చేసే వినియోగదారులు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు దీపావళి సందర్భంగా భారీ డిస్కౌంట్లు, బహుమతులు, గిఫ్ట్ ఆఫర్ల పేరుతో వినియోగదారులను ఆకర్షించి, ఆర్థికంగా మోసగిస్తున్నారని పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు. నకిలీ ఈ-కామర్స్ సైట్లు, ప్రమాదకరమైన ఏపీకే (APK) ఫైల్స్, ఫిషింగ్ లింకులు, సోషల్ మీడియా ప్రకటనల ద్వారా ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు.

మోసగాళ్లు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో నమ్మశక్యం కాని ఆఫర్లతో కూడిన లింకులను సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ లింక్‌లపై క్లిక్ చేయడం లేదా ఏపీకే ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా బాధితుల ఫోన్లలోకి మాల్‌వేర్ ప్రవేశించి, వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలను దొంగిలించి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. సికింద్రాబాద్‌కు చెందిన ఓ మహిళ గిఫ్ట్ ఆఫర్‌ను నమ్మి రూ.1.40 లక్షలు నష్టపోగా, అజంపురాకు చెందిన వృద్ధుడు ఫేక్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి ఏపీకే ఫైల్ ఇన్‌స్టాల్ చేయడం ద్వారా రూ.1.02 లక్షలు పోగొట్టుకున్న సంఘటనలు వెలుగు చూశాయి.

ప్రజలు గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింక్‌లను, ఏపీకే ఫైల్స్‌ను క్లిక్ చేయవద్దని, కేవలం విశ్వసనీయ వెబ్‌సైట్ల నుంచే కొనుగోళ్లు చేయాలని పోలీసులు సూచించారు. బహుమతులు, లక్కీ డ్రాల పేరుతో వచ్చే కాల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దని, అన్ని ఆన్‌లైన్ ఖాతాలకు టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) ఎనేబుల్ చేసుకోవాలని కోరారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *