జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి కేసీఆర్: ఈ నెల 19న రోడ్ షోలో పాల్గొనే అవకాశం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని దృఢంగా ఉన్న బీఆర్ఎస్, ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగనున్నట్లు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ నెల 19న జూబ్లీహిల్స్‌లో జరిగే రోడ్ షోలో ఆయన పాల్గొంటారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యం కాగా, ఆయన భార్య మాగంటి సునీత గోపీనాథ్‌ను బీఆర్ఎస్ బరిలోకి దింపింది. మంగళవారం (అక్టోబర్ 14) తమ అభ్యర్థికి బీఫామ్ అందజేసిన కేసీఆర్, సునీతా గోపీనాథ్‌కు ధైర్యం చెప్పి, తాను కూడా ప్రచారంలో పాల్గొంటానని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్‌లో వరంగల్‌లో జరిగిన రజతోత్సవ సభ తర్వాత కేసీఆర్ మళ్లీ ప్రజాక్షేత్రంలో కనిపించలేదు.

జూబ్లీహిల్స్ గెలుపు కోసం వ్యూహాలకు పదును పెడుతున్న బీఆర్‌ఎస్ శ్రేణులు, కేసీఆర్ రోడ్ షోలో పాల్గొంటే ప్రజలను మరింతగా ఆకర్షించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మజ్లిస్ మద్దతు కూడా ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కేసీఆర్ ప్రచారం బీఆర్ఎస్‌కు కీలకంగా మారనుంది. అయితే, ఈ రోడ్ షోలో పాల్గొనే విషయాన్ని పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *