అంబులెన్స్‌ల కొరతకు చెక్: ఏపీలో 190 కొత్త ‘108’ వాహనాలు – మంత్రి సత్యకుమార్ యాదవ్

రోడ్డు ప్రమాదాలు, ఇతర అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ‘గోల్డెన్ అవర్’ (ప్రమాదం జరిగిన గంటలోపు) అత్యవసర వైద్య సహాయం అందించడం చాలా ముఖ్యం. ఈ అవసరాన్ని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అంబులెన్స్‌ల కొరత, పాత వాహనాల సమస్యను పరిష్కరించడానికి త్వరలో 190 కొత్త 108 వాహనాలను ప్రారంభించనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల రోగులకు, క్షతగాత్రులకు వేగవంతమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

కొత్తగా ప్రారంభించనున్న 190 అంబులెన్స్‌లలో 56 అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్ట్‌ (ALS), 136 బేసిక్‌ లైఫ్‌ సపోర్ట్‌ (BLS) అంబులెన్సులు ఉన్నాయి. ఈ వాహనాలు గోల్డెన్ అవర్‌లోనే క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించేందుకు వీలు కల్పిస్తాయి. మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో నిర్వహణ సరిగా లేక డొక్కుగా తయారైన, తరచూ రిపేర్ అవుతున్న పాత అంబులెన్స్‌లను తొలగిస్తామని, వాటి స్థానంలో కొత్త వాటిని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 650 అంబులెన్స్‌లు నడుస్తుండగా, పాత వాటిని తొలగించి కొత్త వాటిని కలిపితే మొత్తం వాహనాల సంఖ్య 731కు చేరుకుంటుందని మంత్రి వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్‌ గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం 108 అంబులెన్స్‌లను నిర్లక్ష్యం చేసిందని, కాలం చెల్లిన వాహనాలను ఉపయోగించడం వల్ల ప్రమాద బాధితులను ఆసుపత్రులకు తరలించడంలో జాప్యం జరిగిందని ఆరోపించారు. కొత్త అంబులెన్స్‌లు నేషనల్ అంబులెన్స్‌ కోడ్‌ (NAC) ప్రకారం పసుపు, ఎరుపు రంగుల్లో ఉంటాయని ఆయన వెల్లడించారు.

profile picture

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *