జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక… కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ… ఇంకా బరిలో దిగని పెద్ద పార్టీలు..

తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం రెండో రోజు మరో 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. దీంతో ఇప్పటివరకు నామినేషన్లు వేసిన వారి సంఖ్య 21కి చేరినట్లు రిటర్నింగ్ అధికారి పి. సాయిరాం వెల్లడించారు. రెండో రోజు నామినేషన్లు వేసిన వారిలో ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారని ఆయన తెలిపారు.

 

మంగళవారం పత్రాలు సమర్పించిన వారిలో పాట పార్టీ తరఫున ఎం. వెంకట్ రెడ్డి, అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి మహమ్మద్ మన్సూర్ అలీ, శరంజీవి పార్టీకి చెందిన జాజుల భాస్కర్, ఆల్ ఇండియా కిసాన్ జనతా పార్టీ నుంచి ఎల్. చంద్రశేఖర్ వంటి వారు ఉన్నారు. సోమవారం నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవగా, ఇప్పటివరకు ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థుల తరఫున నామినేషన్లు దాఖలు చేయకపోవడం గమనార్హం.

 

సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (బీఆర్ఎస్) జూన్‌లో మరణించడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా గోపీనాథ్ అర్ధాంగి మాగంటి సునీతను ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్‌ను బరిలోకి దించింది. బీజేపీ తన అభ్యర్థిని ఒకటి రెండు రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉంది. 2023 ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్, కాంగ్రెస్ అభ్యర్థి, భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్‌పై 16,337 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయన గుండెపోటుకు చికిత్స పొందుతూ మరణించారు. దాంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నినిక అనివార్యమైంది.

 

అక్టోబర్ 21 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంది. 22న నామినేషన్ల పరిశీలన, 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. నవంబర్ 11న పోలింగ్ నిర్వహించి, 14న ఓట్లను లెక్కించనున్నారు.

 

ఓటర్లలో చైతన్యం పెంచేందుకు ‘స్వీప్’

 

మరోవైపు, ఉప ఎన్నికలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం నియోజకవర్గంలో ‘స్వీప్’ (సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా యువ ఓటర్లను ప్రోత్సహించేందుకు ఎన్నికల ప్రక్రియ, కొత్త ఓటరు నమోదు, ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా వివరాల సవరణ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ తెలిపారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెడతామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. నియోజకవర్గం అంతటా ఓటరు చైతన్య కార్యక్రమాలను విస్తృతం చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *