వైజాగ్‌ లో గూగుల్ AI..!

ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన కంపెనీలు ఒక ఎత్తు. ఇప్పుడు కొత్తగా వస్తున్న గూగుల్ AI సెంటర్‌ మరొక ఎత్తు. వైజాగ్ లో వచ్చే ఏడాది నుంచి గూగుల్ AI సెంటర్‌ ఏర్పాటుకి సంబంధించి పనులు మొదలయ్యే అవకాశాలున్నాయి. వైజాగ్ కే కాదు మొత్తం దేశానికే గూగుల్ AI సెంటర్‌ ఒక మణిహారం లాంటిది అవుతుంది. ఈ మేరకు ఢిల్లీలో గూగుల్ సంస్థతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది.

 

ఎన్ని ఉద్యోగాలు..?

ప్రస్తుతం భారత్ లో గూగుల్ కి సంబంధించి 5 కేంద్రాలు ఉన్నాయి. వాటన్నిటిలో కలిపి ప్రస్తుతం 14వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పుడు విశాఖలో ఏర్పాటు చేసే గూగుల్ AI సెంటర్‌ ద్వారా మొత్తం 1,88,000 ఉద్యోగాలు వస్తాయి. ఇందులో గూగుల్ AI సెంటర్‌ నిర్మాణం, అందులో ఇన్ ఫ్రా స్ట్రక్చర్, అంతర్గత రోడ్ల నిర్మాణం, క్లీన్ ఎనర్జీకి సంబంధించిన సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు.. ఇతరత్రా నిర్మాణ పనుల ద్వారా 40 వేల నుంచి 60వేల మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. 50వేల నుంచి 70వేల మంది టెక్నికల్ ఉద్యోగాలు లభిస్తాయి. వీరంతా కంప్యూటర్లపై పనిచేస్తారు. ఏఐ కోసం TPUలు అని పిలిచే ప్రత్యేక చిప్‌లపై కూడా పనిచేయాల్సి ఉంటుంది. ఇక గూగుల్ AI సెంటర్‌ కి అనుసంధానంగా కొన్ని షాపులు ఏర్పాటవుతాయి. ఉద్యోగుల కోసం రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి రంగాల్లో దాదాపు 80వేల నుంచి లక్షమందికి ఉద్యోగులు పనిచేయాల్సి ఉంటుంది. వీటితోపాటు నిపుణుల తయారీ కోసం 20వేల నుంచి 30వేల మంది ఉపాధ్యాయులు, ట్రైనర్లు అవసరం అవుతారు. ఇలా మొత్తంగా కలుపుకొంటే 1,88,000 మందికి గూగుల్ AI సెంటర్‌ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. ఇప్పటి వరకు భారత్ లో కేవలం 14వేలమందితో పని చేయించుకుంటున్న గూగుల్ సంస్థ ఇకపై ఒక్క వైజాగ్ లోనే లక్షా 88వేల మందికి ఉపాధి చూపిస్తుందనే విషయం ఏపీకి గర్వకారణంగా మారింది.

 

రాష్ట్ర అభివృద్ధి..

వైజాగ్ లో గూగుల్ ఏర్పాటు చేసే AI సెంటర్‌ 1 గిగావాట్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. భవిష్యత్తులో దీన్ని మరింత విస్తరిస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇక ఈ సెంటర్ కోసం గూగుల్ సంస్థ 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెడుతోంది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.1,33,000 కోట్లు. ఇంత పెద్ద పెట్టుబడిని మనం సింగిల్ కంపెనీ, అది కూడా గూగుల్ లాంటి భారీ కంపెనీ పెడుతుందని ఊహించలేం. ఆసియాలోనే ఆ సంస్థ ఏర్పాటు చేస్తున్న అతి పెద్ద ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. 2026లో నిర్మాణం మొదలైతే, 2028 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఆ తర్వాత 2028-32 మధ్య కాలంలో స్థూల రాష్ట్ర ఉత్పత్తికి ఏటా రూ.10,518 కోట్లు దీని ద్వారా సమకూరుతుందని తెలుస్తోంది.

 

1 గిగావాట్ సామర్థ్యం..

గూగుల్ AI సెంటర్‌ ఎంత పెద్దది అని చెప్పేందుకు అది వినియోగించుకునే విద్యుత్ శక్తిని ఉదాహరణగా చూపుతున్నారు. వైజాగ్ లో ఏర్పాటు చేసే గూగుల్ AI సెంటర్‌ 1 గిగావాట్ విద్యుత్ శక్తిని ఉపయోగించుకుంటుంది. ఈ విద్యుత్ ని పూర్తిగా సోలార్ ప్యానెళ్ల ద్వారా తయారు చేసుకోడానికి గూగుల్ ప్రయత్నాలు చేస్తోంది. అంటే పూర్తి స్థాయిలో ఇది పర్యావరణ హిత ప్రాజెక్ట్ అనమాట. గూగుల్ సెర్చ్ ని మరింత ప్రామాణికంగా, వేగంగా మార్చేందుకు ఈ AI సెంటర్‌ ఉపయోగపడుతుంది. గూగుల్ క్లౌడ్‌ను ఉపయోగించడంలో ఇది సహాయపడుతుంది. ఈ AI సెంటర్‌ ఒక పెద్ద లైబ్రరీగా అనమాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *