ఏపీ ప్రజలకు బిగ్‌షాక్.. నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్..

ఏపీలో ఇవాళ్టి నుంచి NTR హెల్త్ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రైవేట్ హాస్పటల్స్‌కి ప్రభుత్వం దాదాపు 2 వేల 700 కోట్ల బకాయీలు ఉంది. దీంతో ఈ బకాయిలు విడుదల చేయాలని కొంత కాలంగా ప్రైవేట్ హాస్పటల్‌ యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే సమయం కోరుతూ ప్రభుత్వం ఇంతవరకు వచ్చింది. కానీ రెండు రోజులుగా ప్రైవేట్ డాక్టర్స్ ఆందోళనను ఉధృతం చేశారు.

 

ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్.

ప్రజాప్రతినిధులను సైతం కలిశారు. కానీ ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు పూర్తిగా నిలిపివేయాలని ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యం నిర్ణయించారు.

 

స్పెషాలిటీ ఆస్పత్రులు సేవలు ఆపొద్దని కోరిన సత్య కుమార్..

ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ అంశంపై స్పందించారు మంత్రి సత్య కుమార్ యాదవ్. స్పెషాలిటీ హాస్పిటళ్లు సేవలను ఆపొద్దని కోరుతున్నట్లు తెలిపారాయన. గత ప్రభుత్వం 2 వేల 700 కోట్ల మేర బకాయిలు పెట్టిందని.. తాము వచ్చాక విడతల వారీగా చెల్లిస్తున్నామన్నారు. ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా ఉందన్న విషయం తమకు తెలుసన్నారు. ఇదే అంశంపై సీఎం చంద్రబాబును కలిసి చర్చిస్తానని తెలిపారు మంత్రి సత్య కుమార్.

 

ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. వైద్య సేవలు బంద్- ఎస్‌విఎల్‌ నారాయణరావు

ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోవడం లేదని, అందుకే వైద్యసేవలు నిలిపేస్తున్నామని ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్‌ ఎస్‌విఎల్‌ నారాయణరావు తెలిపారు. దీంతో రోగులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సెప్టెంబరు 25న సమావేశమైన ఆషా రాష్ట్ర కార్యవర్గం భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించింది. దీని అనుగుణంగానే ఇవాళ్టి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేయాలని నెట్వర్క్ ఆసుపత్రులు నిర్ణయించాయి.

 

వైద్యశాఖ అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ.. దొరకని పరిష్కారం..

ఆషా కార్యవర్గం భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించి, ప్రభుత్వ పెద్దలకు ట్రస్ట్ ఉన్నతాధికారులకు వైద్యశాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ, ఇంత వరకు పూర్తిస్థాయి పరిష్కారం కనిపించలేదు. ఆషా ప్రతినిధులు గత వారం రోజులుగా జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపిలను కలిసి తమ ఆవేదనను విన్నవిస్తూనే ఉన్నారు. ఆసుపత్రుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడతల వారీగా కాకుండా, సాధ్యమైనంత త్వరగా పెద్ద మొత్తంలో విడుదల చేయాలని ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *