ఫార్మా ఇండస్ట్రీలో హైదరాబాద్ మరో మైల్ స్టోన్..!..

తెలంగాణ మరోసారి ప్రపంచ ఫార్మా రంగ దృష్టిని ఆకర్షించింది. అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజ సంస్థ ఎల్ లిల్లీ (Eli Lilly and Company) హైదరాబాద్‌లో.. భారీ స్థాయిలో తయారీ యూనిట్‌ (Manufacturing Hub)‌ను నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. మొత్తం రూ.9,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ సిద్ధమైంది. ఈ ప్రాజెక్ట్‌తో తెలంగాణ రాష్ట్రం ఫార్మా పరిశ్రమలో మరో అగ్రస్థానాన్ని దక్కించుకోనుంది.

 

ఎల్ లిల్లీ ప్రతినిధుల కీలక సమావేశం

సోమవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో.. ఎల్ లిల్లీ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డితో భేటి అయ్యారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎల్ లిల్లీ గ్లోబల్ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్, ఇండియా ప్రెసిడెంట్ విన్సెలో టుకర్, ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు.

 

సమావేశంలో ఎల్ లిల్లీ ప్రతినిధులు తెలంగాణలో ఏర్పాటు చేయనున్న.. అధునాతన తయారీ యూనిట్ వివరాలను వివరించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే ఈ యూనిట్‌లో మాన్యుఫాక్చరింగ్, క్వాలిటీ కంట్రోల్, టెక్నికల్ సూపర్విజన్, రీసెర్చ్ సపోర్ట్ వంటి విభాగాలు ఉండనున్నాయి. ఇది ఆసియా స్థాయిలోనే కాకుండా గ్లోబల్ ఆపరేషన్లకు కూడా ముఖ్య కేంద్రంగా ఉండనుంది.

 

ఉద్యోగావకాశాలకు కొత్త దారి

ఈ యూనిట్‌తో తెలంగాణలో వేలాది మంది యువతకు.. ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కెమిస్టులు, బయోకెమిస్టులు, అనలిటికల్ సైంటిస్టులు, ఇంజనీర్లు, క్వాలిటీ కంట్రోల్ నిపుణులు, మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్ వంటి అనేక విభాగాల్లో నియామకాలు త్వరలో ప్రారంభమవుతాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

 

150 ఏళ్ల ఫార్మా వారసత్వం

1876లో స్థాపించబడిన అమెరికా ఫార్మా దిగ్గజం ఎల్ లిల్లీ గత 150 ఏళ్లుగా.. ప్రపంచ వ్యాప్తంగా వైద్య రంగంలో అత్యుత్తమ సేవలు అందిస్తోంది. ప్రస్తుతం 120కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ డయాబెటిస్, ఓబెసిటీ, ఆల్జీమర్, క్యాన్సర్, ఇమ్యూన్ వ్యాధులకు సంబంధించిన కొత్త ఔషధాల అభివృద్ధిలో ముందుంది. భారతదేశంలో గురుగ్రామ్‌, బెంగళూరులో ఇప్పటికే తమ కార్యాలయాలను నిర్వహిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ (GCC) ప్రారంభించిన సంస్థ, ఇప్పుడు తయారీ హబ్ ద్వారా తమ వ్యాప్తిని మరింత విస్తరించనుంది.

 

ముఖ్యమంత్రి స్పందన

తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు వచ్చిన ఎల్ లిల్లీ ప్రతినిధులను.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. “హైదరాబాద్ ఫార్మా రంగంలో ఇప్పటికే ప్రపంచ పటంలో నిలిచింది. ఇప్పుడు ఎల్ లిల్లీ వంటి గ్లోబల్ కంపెనీలు రాష్ట్రంపై నమ్మకం ఉంచి పెట్టుబడులు పెడుతున్నాయి అంటే ఇది మన సత్తాను చూపిస్తుంది అని సీఎం అన్నారు.

 

అదే సమయంలో ఆయన, “1961లో ఐడీపీఎల్ (IDPL) స్థాపనతో.. ప్రారంభమైన హైదరాబాద్‌ ఫార్మా ప్రయాణం ఇప్పుడు గ్లోబల్ స్థాయికి చేరింది. దేశంలో ఉత్పత్తి అయ్యే బల్క్ డ్రగ్స్‌లో 40 శాతం హైదరాబాద్ నుంచే వస్తున్నాయి. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ల తయారీలోనూ నగరం కీలక పాత్ర పోషించింది అని గుర్తు చేశారు.

 

ప్రభుత్వం ఫార్మా పరిశ్రమలకు పూర్తి మద్దతు ఇస్తుందని, జీనోమ్ వ్యాలీలో అధునాతన ఏటీసీ సెంటర్ (Advanced Training Centre) ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ప్రతిభావంతులకు ఉద్యోగాలు, పెట్టుబడిదారులకు నమ్మకం.. ఇదే తెలంగాణ మోడల్ అని ఆయన అన్నారు.

 

మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయం

ఎల్ లిల్లీ పెట్టుబడులు తెలంగాణ పరిశ్రమల అభివృద్ధి తీరుకు ప్రతిబింబమని.. మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఫార్మా రంగంలో తెలంగాణ ఇప్పటికే దేశంలో ముందంజలో ఉంది. లైఫ్ సైన్సెస్‌, బయోటెక్‌, హెల్త్‌కేర్ రంగాల్లో ఈ పెట్టుబడులు కొత్త ఉత్సాహాన్ని తెస్తాయి. ఇది రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలను విస్తరించే మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *