తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల..! ఐదు దశల్లో ఎన్నికలు..

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. సోమవారం తెలంగాణ ఈసీ రాని కుముదిని ఆ షెడ్యూల్ ను ప్రకటించారు. 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఐదు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 9 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలుకానుంది.

 

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఐదు దశల్లో ఎన్నికల ప్రక్రియ జరగనుంది. తొలుత ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల జరగనున్నాయి. ఆ తర్వాత జడ్పీటీసీ వంతు కానుంది. గ్రామ పంచాయతీలకు చివరగా ఎన్నికలు జరగనున్నట్లు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రాని కుముదిని వెల్లడించారు.

 

ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు అక్టోబర్‌ 9 నుంచి నామినేషన్లు కార్యక్రమం మొదలు కానున్నట్లు ఎస్‌ఈసీ వెల్లడించారు. అక్టోబర్‌ 23న తొలివిడత, 27న రెండో విడత ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్సీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని వెల్లడించారు.

 

ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల విషయానికి వద్దాం. అక్టోబర్ 31న తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 4న రెండో విడత, నవంబర్ 8న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీలకు అదే రోజు ఓట్ల లెక్కింపు జరగనుంది.

 

తెలంగాణలోని 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఈసీ తెలిపారు. వాటిలో 5,749 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 565 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నట్లు ఈసీ రాణికుముదిని వెల్లడించారు. ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లయ్యింది.

 

ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. వెంటనే జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులతో పార్టీల కీలక నేతలు మంతనాలు జరిపారు. వెంటనే అభ్యర్థుల జాబితాను పంపాలని కోరినట్టు తెలుస్తోంది. దాదాపు నెలన్నరపాటు స్థానిక సంస్థల సమరం జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *