రివర్సైన వైసీపీ డిజిటల్ బుక్.. ఆ పార్టీ నేతలపైనే ఫిర్యాదులు..!

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతల అరెస్టులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపిస్తూ.. టీడీపీ రెడ్ బుక్ తెచ్చింది. ఈ బుక్ లో టీడీపీ కార్యకర్తలు, నేతలను వేధించిన వారి పేర్లు రాస్తామని స్పష్టం చేసింది. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైంది. అప్పటి నుంచి ఏపీలో రెడ్ బుక్ పాలన అమలుచేస్తున్నారని మంత్రి లోకేశ్ లక్ష్యంగా వైసీపీ ఆరోపణలు చేస్తుంది.

 

కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తుందని ఆరోపిస్తూ.. ఇటీవల ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ యాప్ తీసుకొచ్చారు. వైసీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఈ డిజిటల్ బుక్ యాప్ లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

 

డిజిటల్ బుక్ శ్రీరామ రక్ష

డిజిటల్ బుక్ వైసీపీ కార్యకర్తలకు శ్రీరామ రక్ష అని వైఎస్ జగన్ అన్నారు. ‘రెడ్ బుక్’ గురించి మాట్లాడుతున్న వారికి వైసీపీ డిజిటల్ బుక్ తో సమాధానం చెబుతుందన్నారు. కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఈ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. అన్యాయం చేసిన వారు ఎక్కడ దాక్కున్నా శిక్ష పడేలా చేస్తామన్నారు.

 

డిజిటల్ బుక్ రివర్స్!

వైసీపీ డిజిటల్ బుక్ వ్యూహం ఆ పార్టీకే రివర్స్ అవుతుంది. ‘డిజిటల్‌ బుక్‌’ యాప్‌లో వైసీపీ నేతలపైనే ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. మాజీ మంత్రి విడదల రజినిపై డిజిటల్ బుక్ లో ఫిర్యాదు అందింది. నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం మాజీ మంత్రి విడదల రజినిపై ఫిర్యాదు చేశారు. 2022లో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని నవతరం పార్టీ ఆఫీసు, తన ఇంటిపై రజిని దాడి చేయించారని సుబ్రహ్మణయం ఫిర్యాదు చేశారు.

 

మాజీ మంత్రి రజినిపై చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని రావు సుబ్రహ్మణ్యం వైసీపీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. సొంత పార్టీ నేతలపైనే డిజిటల్‌ బుక్‌ యాప్‌లో ఫిర్యాదులు వస్తుండడంతో వైసీపీ కలకలం రేగింది.

 

విడదల రజినిపై చర్యలు తీసుకోండి

మాజీ మంత్రి విడదల రజినిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని వైసీపీ అధినేత జగన్‌ ను డిజిటల్‌ బుక్‌ యాప్‌ ద్వారా కోరారు రావు సుబ్రహ్మణ్యం. తన ఫిర్యాదుపై జగన్ స్పందించి తనకు న్యాయం చేస్తే వైసీపీ కార్యకర్తలకు కూడా న్యాయం జరుగుతుందనే నమ్మకం కలుగుతుందన్నారు. వైసీపీ డిజిటల్‌ బుక్‌ యా‌ప్‌‌లో విడదల రజినిపై ఫిర్యాదు అనంతరం వచ్చిన టికెట్‌ను రావు సుబ్రహ్మణ్యం మీడియాకు చూపించారు.

 

వైసీపీ డిజిటల్ బుక్ యాప్ ను చిలకలూరిపేటలోని తన నివాసంలో విడదల రజిని వైసీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి ప్రారంభించారు. ఆమె యాప్ ప్రారంభించిన కొద్దిసేపటికే ఈ ఫిర్యాదు నమోదు కావడం గమనార్హం. వైసీపీ డిజిటల్ బుక్ యాప్ లో సొంత పార్టీ నేతపైనే ఫిర్యాదు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫిర్యాదుపై వైసీపీ, విడదల రజిని ఇంకా స్పందించలేదు.

 

వైసీపీ నేతలపై చర్యలుంటాయా?

వైసీపీ డిజిటల్ బుక్ యాప్ ప్రత్యేకంగా వైసీపీ నేతలపై ఫిర్యాదుల కోసమే అంటూ కూటమి నేతలు సెటైర్లు వేస్తున్నారు. డిజిటల్ బుక్ లో ఫిర్యాదులు వచ్చిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే రెడ్ బుక్ అంటే కక్ష సాధింపు అని, డిజిటల్ బుక్ అన్యాయం చేసిన వారిని చట్టం ముందు నిలబెట్టడానికే వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *