మేధా స్కూల్ డ్రగ్స్ కేసులో కీలక ట్విస్ట్..!

హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి మేధా స్కూల్‌కు సంబంధించిన.. డ్రగ్స్ కేసు రోజురోజుకి కొత్త కొత్త కోణాలను బయటకు వస్తున్నాయి. ఇప్పటివరకు స్కూల్ డైరెక్టర్ జయప్రకాశ్ గౌడ్, గురువా రెడ్డి, మరికొందరు వ్యక్తుల పేర్లు వెలుగులోకి రాగా, తాజాగా మరికొన్ని అంశాలు తెరపైకి వచ్చాయి.

 

ఈ కేసులో ప్రధాన నిందితుడైన జయప్రకాశ్ గౌడ్.. చిన్న పిల్లల స్కూల్ ఫీజుల రూపంలో వచ్చిన డబ్బును డ్రగ్స్ దందాకు పెట్టుబడిగా మలచాడని పోలీసులు గుర్తించారు.

 

గురువా రెడ్డి నుంచి ఆల్ఫ్రోజోలం ఫార్ములా కొనుగోలు

జయప్రకాశ్ గౌడ్, ఫార్మాస్యూటికల్ లాబ్‌లలో పనిచేసిన అనుభవం ఉన్న గురువా రెడ్డి నుంచి ఆల్ఫ్రోజోలం తయారీ ఫార్ములాను కొనుగోలు చేశాడు. సమాచారం ప్రకారం, ఈ డీల్ రూ.2 లక్షలకు జరిగిందని చెబుతున్నారు. ఫీజు రూపంలో వచ్చిన డబ్బుతోనే ఈ ఫార్ములా డీల్ జరిపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం గురువా రెడ్డి పరారీలో ఉన్నాడు.

 

స్కూల్‌ను డ్రగ్స్ తయారీ కేంద్రంగా మార్చిన ఘటన

పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన క్లాస్‌రూమ్‌లు.. అక్రమంగా డ్రగ్స్ తయారీ కేంద్రాలుగా మారడం ఈ కేసులో అత్యంత షాకింగ్ విషయం. స్కూల్‌లోని కొన్ని క్లాస్‌రూమ్‌లలో రియాక్టర్లు చేసి ఆల్ఫ్రోజోలం వంటి.. మానసిక సమస్యలకు వాడే మందులను భారీ స్థాయిలో ఉత్పత్తి చేశారు. పోలీసులు ఇప్పటివరకు 8 రియాక్టర్లు, 8 డ్రయ్యర్లు, పెద్ద ఎత్తున కెమికల్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు.

 

ఈగల్ టీమ్ దర్యాప్తు

ఈ కేసులో ఈగల్ టీమ్‌ పోలీసులు.. దాదాపు 10 గంటలపాటు సోదాలు నిర్వహించారు. స్కూల్ ప్రాంగణం, ల్యాబ్ తరహా గదులు, స్టోర్‌రూమ్‌లు అన్నీ పరిశీలించారు. ఈ దర్యాప్తులో భాగంగా జయప్రకాశ్ గౌడ్ ఇంటి నుంచి రూ.20 లక్షల నగదు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫోన్‌లో డ్రగ్స్ డీల్స్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు.

 

డ్రగ్స్ విక్రయ నెట్‌వర్క్‌పై దర్యాప్తు

తయారు చేసిన ఆల్ఫ్రోజోలం, ఇతర మత్తు పదార్థాలు ఎవరెవరికి విక్రయించారనే అంశంపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ మత్తు పదార్థాలు.. సరఫరా చేసిన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పట్టుబడ్డ రసాయనాల పరిమాణం చూస్తే, ఇది ఒక చిన్న స్థాయి ఉత్పత్తి కేంద్రం కాదని, పెద్ద నెట్‌వర్క్‌కు సంబంధించినదని పోలీసులు భావిస్తున్నారు.

 

సమాజంపై తీవ్ర ప్రభావం

ఈ కేసు వెలుగులోకి రావడంతో.. తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పిల్లల కోసం నమ్మి చెల్లించిన ఫీజులు ఇలా అక్రమ పనులకి వినియోగించబడటం సమాజానికి పెద్ద ముప్పు అని భావిస్తున్నారు. చిన్నారుల స్కూల్ అనే ముసుగులో డ్రగ్స్ ఉత్పత్తి చేయడం, చట్టవిరుద్ధ వ్యాపారం సాగించడం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

బోయిన్‌పల్లి మేధా స్కూల్ డ్రగ్స్ కేసు.. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. తల్లిదండ్రుల కష్టార్జిత డబ్బును డ్రగ్స్ తయారీకి వాడటం, స్కూల్‌ను డెన్‌గా మార్చడం, పెద్ద ఎత్తున కెమికల్స్ స్వాధీనం కావడం ఇవన్నీ ఈ కేసు ఎంత లోతుగా ఉందో సూచిస్తున్నాయి. గురువా రెడ్డి పరారీలో ఉండటం, మరికొందరు వ్యక్తుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో.. ఈ కేసు ఇంకా కొత్త మలుపులు తిరిగే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *