పవన్‌కు బొత్స సూటి ప్రశ్న..!

రుషికొండ ప్యాలెస్ రాజకీయాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని వైసీపీ భావిస్తోందా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్‌‌పై బొత్సను రంగంలోకి దిగారా? నాణ్యత లోపముంటే ఎందుకు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోలేదు? మీరెందుకు డబ్బులు చెల్లించారు? ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ చేశారు. ఇంతకీ ప్యాలెస్ చుట్టూ ఏం జరుగుతోంది?

 

ఏపీలో రాజకీయాలు రుషికొండ ప్యాలెస్ చుట్టూ తిరుగుతున్నాయి. అధికార పార్టీ వైఫల్యాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని వైసీపీ భావిస్తోంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్‌పై కౌంటరిచ్చే ప్రయత్నం చేశారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ.

 

గతవారం విశాఖ వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పార్టీ నేతలతో కలిసి రుషికొండ ప్యాలెస్‌ను సందర్శించారు. అయితే భవనం లోపల స్లాబు పెచ్చలు ఊడిపోయినట్టు కనిపించాయి. దీనిపై డిప్యూటీ సీఎం ఘాటుగా రియాక్ట్ అయ్యారు. భవనాల నాణ్యతపై ఆడిటింగ్ చేయించాలని అన్నారు. దీనివెనుక ఎవరున్నారో తెలుస్తుందన్నారు.

 

ఈ భవనాలను డెస్టినేషన్‌ వెడ్డింగ్ లకు ఇవ్వాలా? లేక దుబాయ్ ఫార్ములాను ఫాలో అవ్వాలా అనేదానిపై దృష్టి సారిస్తామని తెలిపారు. రెండురోజుల కిందట కేబినెట్‌లో ఆ ప్యాలెస్‌పై చర్చకు వచ్చింది. దీనిపై నివేదిక ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు సీఎం చంద్రబాబు. అదే సమయంలో భవనాల నాణ్యతపై ఆడిటింగ్ చేస్తారా? లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

 

ఈ వ్యవహరంపై మాజీమంత్రి, వైసీపీ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నోరు విప్పారు. విశాఖలో మీడియాలో మాట్లాడిన ఆయన, పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. రుషికొండ భవనాల్లో నిజంగా పెచ్చులు ఊడిపోతే కాంట్రాక్టర్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఆ కాంట్రాక్టర్‌కు డబ్బులు ఎవరు ఇచ్చారు?

 

రుషికొండ భవనాలను ఏం చేయాలో అర్ధం కావడం లేదని చెబుతున్న మీరు, చాలా భూములు బయట వారికి కట్టబెడుతున్నారని అన్నారు. ఆ తరహాలో ఇది ఎవరికైనా ఇవ్వొచ్చు కదా? అంటూ తనదైన శైలిలో మాట్లాడారు. రుషికొండ భవనాలను వెడ్డింగ్ డెస్టినేషన్‌కి ఇవ్వొచ్చు కదా అంటూ ఉచిత సలహా ఇచ్చేశారు.

 

మరి బొత్స ప్రశ్నించినట్టుగా భవనాల నాణ్యతపై ప్రభుత్వం ఆడిటింగ్ నిర్వహిస్తుందా? నాణ్యత లేదని తేలితే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటుందా? బొత్స మాటలకు కూటమి సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మరో 10 రోజుల్లో మొదలుకానున్న అసెంబ్లీ సమావేశాల్లో రుషికొండ ప్యాలెస్‌పై క్లారిటీ రావడం ఖాయమని అంటున్నాయి అధికారిక వర్గాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *