టీటీడీ స్ట్రాంగ్ వార్నింగ్..! అలా చేస్తే జైలుకే..!

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల భక్తిని దుర్వినియోగం చేసుకోవడానికి దళారులు, మోసగాళ్లు కొత్త కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. కొంతమంది భక్తులు గూగుల్, సోషల్ మీడియా ద్వారా వసతి, దర్శన టికెట్ల కోసం వెతుకుతుంటే నకిలీ వెబ్‌సైట్లు, తప్పుడు ఫోన్ నంబర్లు వలగా మారుతున్నాయి. ఈ మోసపూరిత చర్యలపై ఇటీవల ఒక ఘటనే స్పష్టమైన ఉదాహరణగా మారింది.

 

గత వారం ఒక భక్తురాలు శ్రీమతి ఊర్వశి తిరుమలలో వసతి కోసం గూగుల్ సర్చ్‌లోకి వెళ్లగా “శ్రీనివాసం రెస్ట్ హౌసెస్” పేరుతో ఓ వెబ్‌సైట్ కనిపించింది. ఆ వెబ్‌సైట్‌లోని మొబైల్ నంబర్ 8062180322 కి కాల్ చేస్తే, అభిమన్యు అనే వ్యక్తి తాను శ్రీనివాసం కాంప్లెక్స్ రిసెప్షన్ స్టాఫ్‌నని తప్పుడు పరిచయం చేసుకున్నాడు. వసతి కల్పిస్తామని నమ్మబలికి కొంత డబ్బు ఆన్‌లైన్‌లో తీసుకున్నాడు. మరీ మోసాన్ని నమ్మదగ్గలా చేయడానికి, టికెట్ పీడీఎఫ్ పంపిస్తానని చెప్పాడు. కానీ డబ్బులు తీసుకున్న తర్వాత ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లకు స్పందించకుండా ఆచూకీ లేకుండా పోయాడు.

 

అవగాహన కలిగిన ఆ భక్తురాలు వెంటనే 1930 నంబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ కి, స్థానిక పోలీస్ స్టేషన్‌కి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా టిటిడి అప్రమత్తమై, ఇలాంటి మోసాలపై భక్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

 

టిటిడి హెచ్చరిక

ఇటీవలి కాలంలో నకిలీ వెబ్‌సైట్లు, ఫేక్ టికెట్లు, మోసపూరిత దళారులు పెరుగుతున్నారని టిటిడి గుర్తించింది. కాబట్టి ఎవరు వసతి లేదా దర్శన టికెట్ల పేరుతో డబ్బులు అడిగినా, లేదా అనుమానాస్పదంగా ప్రవర్తించినా, భక్తులు వెంటనే టిటిడి విజిలెన్స్ విభాగాన్ని సంప్రదించాలి. ఇందుకు ప్రత్యేక నంబర్ 0877 – 2263828 ని టిటిడి అందుబాటులో ఉంచింది. అదే విధంగా, దళారుల వలలో పడి మోసపోతే ఇకపై కఠిన చర్యలు తప్పవని స్పష్టంచేసింది. టికెట్లు, వసతి కోసం అక్రమ మార్గాలు అనుసరించడం వలన దళారులతో పాటు, భక్తులపైనా చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశముందని టిటిడి హెచ్చరిక జారీ చేసింది.

 

భక్తులకు సూచనలు

టిటిడి అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారానే వసతి, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలి. TTD Mobile App ద్వారా కూడా ఆధార్ కార్డ్ ఆధారంగా ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోవచ్చు. ఇతర వెబ్‌సైట్లు, సోషల్ మీడియా పేజీలు, ఫేక్ నంబర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మరాదు. ఏవైనా సందేహాలు ఉంటే TTD Toll Free Number 155257 కి కాల్ చేసి స్పష్టత పొందాలి. అనుమాస్పద వ్యక్తులు దగ్గరికి వస్తే వారితో లావాదేవీలు చేయకుండా, వెంటనే విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేయాలి.

 

ఇకపై కఠిన చర్యలు

ఎవరు భక్తులను మోసం చేసినా, నకిలీ టికెట్లు చూపించి డబ్బులు వసూలు చేసినా, వసతి పేరుతో మోసగించినా కేసులు నమోదు చేసి, జైలు శిక్ష తప్పదని టీటీడీ హెచ్చరించింది. కలియుగ దైవ దర్శనానికి వచ్చే భక్తుల విశ్వాసాన్ని మోసం చేసే వారిని కటకటాల వెనుకకు పంపుతామని విజిలెన్స్ అధికారులు హెచ్చరించారు. భక్తులు మాత్రం నిజమైన అధికారిక మార్గాల్లోనే సేవలు పొందాలని మరోసారి టిటిడి విజ్ఞప్తి చేసింది. తిరుమలకు వచ్చే భక్తులను నకిలీ వెబ్‌సైట్లు, దళారుల వలలో పడకుండా రక్షించడానికి టిటిడి పెద్ద హెచ్చరిక ఇచ్చింది. ఇకపై మోసపూరిత చర్యలకు పాల్పడితే కటకటాలే పరిణామమని స్పష్టంచేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *