జీఎస్టీ సంస్కరణలు చరిత్రాత్మకం.. కేంద్రానికి సీఎం చంద్రబాబు ప్రశంసలు..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జీఎస్టీ సంస్కరణలను ఏపీ సీఎం చంద్రబాబు స్వాగతించారు. ఈ మేర‌కు ఆయ‌న ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా జీఎస్టీ సంస్కరణలు చరిత్రాత్మకం అంటూ పోస్టు పెట్టారు. నిత్యావసరాలు, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో జీఎస్టీ శ్లాబులను సవరించడం గొప్ప నిర్ణయమని ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.

 

ఈ సంస్కరణలు పేదలకు మేలు చేసేవిగా, దేశ అభివృద్ధికి దోహదపడేవిగా ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న ఈ సానుకూల నిర్ణయం వల్ల రైతుల నుంచి వ్యాపారుల వరకు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ప్రజలందరి బాగోగులను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయమని కొనియాడారు.

 

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించిన “నవతరం జీఎస్టీ సంస్కరణల”లో భాగంగా ఈ మార్పులు జరిగాయని చంద్రబాబు గుర్తుచేశారు. పన్నుల విధానంలో ఇది ఒక వ్యూహాత్మకమైన ముందడుగు అని ఆయన ప్రశంసించారు. ఈ సంస్కరణలు ప్రతి భారతీయుడి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *