ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్‌ మద్దతు ఎవరికి..?

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్‌కు పార్టీ ఎంపీలు షాక్ ఇవ్వనున్నారా? ముగ్గురు లేదా నలుగురు ఎంపీలు.. ఇండియా కూటమికి మద్దతు పలికేందుకు రెడీ అయ్యారా? ఇప్పటికే ఎన్డీయేకు మా మద్దతు అని వైసీపీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో తెరవెనుక పరిణామాలు చకచకా మారుతున్నాయా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

 

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మా మద్దతు ఎన్డీయేకు అని వైసీపీ తేల్చి చెప్పింది. ఎన్డీయే అభ్యర్థి పేరు ప్రకటించకుండా ముందే జగన్‌కు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఎన్నికల్లో మద్దతు కోరినట్టు తెలిసింది. ఆ విషయం కాసేపు పక్కనపెడితే వైసీపీ మండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ గురువారం ఓపెన్ గా ప్రకటన చేశారు. మా మద్దతు ఎన్డీయే ఇస్తున్నట్లు వెల్లడించారు.

 

అదే సమయంలో వైసీపీ ఎంపీ మేడా రఘునాథరెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గేను ఆయ‌న నివాసంలో సమావేశమయ్యారు. ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఎన్‌డీఏ అభ్య‌ర్థికి వైసీపీ మ‌ద్ద‌తు ఇస్తున్న‌ నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ కాంగ్రెస్ అధ్య‌క్షుడ్ని క‌ల‌వ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చర్చ మొదలైంది.

 

దీనిపై ఎంపీ మేడా క్లారిటీ ఇచ్చేశారు. మ‌ర్యాద‌పూర్వ‌కంగానే ఖ‌ర్గేను క‌లిసిన‌ట్లు తెలిపారు. క‌ర్ణాట‌క హోంమంత్రిగా ఖర్గే ఉన్న‌ప్ప‌టి నుంచి ఆయనతో ప‌రిచ‌యాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఆయనను క‌లిసిన‌ట్లు మనసులోని మాట బయటపెట్టారు. కేవలం స్నేహ‌పూర్వ‌క స‌మావేశమేనని, దీనిపై అత్యుత్సాహం చూపించాల్సిన అవ‌స‌రం లేద‌న్నది ఆయన వెర్షన్.

 

అంతవరకు బాగానే ఉంది. సరిగ్గా ఉపరాష్ట్రపతి ఎన్నిక వేళ ఖర్గేను కలవడం వెనుక అసలు కారణమేంటి? అన్నది ప్రత్యర్థుల నుంచి కౌంటర్లు పడిపోతున్నాయి. ఎన్నిక నోటిఫికేషన్ రాక ముందు సమావేశం అయినా పెద్దగా పట్టించుకునేవారు కాదని అంటున్నారు. ఖర్గేతో సమావేశం వెనుక అధినేత జగన్‌కు ఏమైనా సంకేతాలు వచ్చాయా? అనే కోణంలో రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు.

 

ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్‌కు చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో మేడా భేటీ అయ్యే ఛాన్స్ ఉండదని అంటున్నారు. ఈ లెక్కన కాంగ్రెస్ హైకమాండ్‌తో వైసీపీ ఎంపీలు టచ్‌లో ఉన్నట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో వార్తలు లేకపోలేదు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఏ పార్టీ కూడా విప్ జారీచేయడానికి వీల్లేదు. వారిని నచ్చిన వ్యక్తికి ఓటు వేసుకోవచ్చు.

 

ప్రస్తుతం వైసీపీకి రాజ్యసభ-7, లోక్‌సభలో ముగ్గురు కలిసి మొత్తంగా 10 మంది ఎంపీలు ఉన్నారు. వారిలో ముగ్గురు లేదా నాలుగు ఓట్లు కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశముందన్నది అసలు చర్చ. ఉప రాష్ట్రపతి ఎన్నిక ఎలక్టోరల్‌ కాలేజ్‌ ఓటర్లు 782 మంది ఉన్నారు. లోక్‌సభలో 543 మందికి ఒక సీటు ఖాళీగా ఉంది.

 

రాజ్యసభలో 245 స్థానాలకు ఐదు ఖాళీగా ఉన్నాయి. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవాలంటే 392 మంది ఎంపీలు ఓటు వేయాలి. ఎన్డీయేకు రెండు సభల్లో కలిపి 422 మద్దతు ఉంది. రహస్య బ్యాలెట్ ద్వారా ఉపరాష్ట్రపతి పోలింగ్ జరగనుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లల్లో 392 వస్తే ఆ అభ్యర్థి విజయం సాధించినట్టే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *