నేటి నుంచే ఏపీలో ఫ్రీ బస్సు..!

నేటి నుంచే ఏపీలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ప్రారంభించనుంది కూటమి ప్రభుత్వం. ఇవాళ సాయంత్రం 4 గంటలకు స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం చుట్టనున్నారు సీఎం చంద్రబాబు. విజయవాడ సిటీ బస్టాండ్ నుంచి.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభిస్తారు. నేటి నుంచి.. 8 వేల 456 బస్సుల్లో స్త్రీ శక్తి పథకం అమల్లోకి వస్తుంది. విజయవాడ నుంచి ఆర్టీసీ బస్సులో మహిళలతో కలిసి.. సీఎం చంద్రబాబు కొంత దూరం ప్రయాణించనున్నారు.

 

8,456 బస్సుల్లో స్త్రీ శక్తి పథకం అమలు

ఇప్పటికే.. ఎన్టీఆరో భరోసా పెన్షన్ల పెంపుతో పాటు సూపర్ సిక్స్ పథకాల్లో.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉపాధి అవకాశాల కల్పన, దీపం పథకాలను విజయవంతంగా అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు.. స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయనుంది. ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ.. ఏటా కోటీ 42 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏపీ ఆర్టీసీలో ఉన్న 11 వేల 449 బస్సుల్లో.. 8 వేల 456 బస్సుల్లో స్త్రీ శక్తి పథకం కింద ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తోంది ప్రభుత్వం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో.. మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చు.

 

ఇక.. స్త్రీ శక్తి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు.. ఇప్పటికే ఆర్టీసీ అధికారులు బస్సులను అప్ గ్రేడ్ చేశారు. పాతబడిన హైటెక్ బస్సుల్ని, 5 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన హైటెక్ సర్వీసులను.. పల్లె వెలుగు బస్సులుగా మారుస్తున్నారు. ఇప్పటికే.. రీజియన్ల వారీగా ఆర్టీసీ ఈ ప్రక్రియను ప్రారంభించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే.. స్త్రీ శక్తి పథకం ప్రారంభోత్సవంలో మంత్రులంతా పాల్గొనాలని.. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశించారు.

 

కుటుంబానికి నెలకు రూ.4వేలు మిగులు

మొత్తంగా స్త్రీశక్తి పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి నెలకు సగటున 4 వేల వరకు ఆర్థికంగా మేలు కలుగుతుంది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ప్రయాణించవచ్చు. స్త్రీశక్తి పథకం.. పేద, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా మేలు చేయనుంది. నిత్యం ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం బస్సుల్లో రాకపోకలు జరిపే మహిళలకు ఇకపై ఛార్జీల భారం ఉండదు.

 

వీరికి 15 రోజుల తర్వాతే ఫ్రీ బస్

అయితే ఇప్పటికే పాస్‌‌లు తీసుకున్న వారి పరిస్థితి ఏంటనే చర్చ కొనసాగుతుంది. అంతేకాకుండా కొందరు విద్యార్థులు స్టూడెంట్ పాస్‌లు, మహిళా ఉద్యోగులు, మరికొందరు నెలవారీ, సీజనల్ పాస్‌లు తీసుకున్నవారున్నారు. వారందరికి పాస్‌ల గడువు పూర్తయ్యే వరకు వీరికి జీరోఫేర్ టికెట్లు జారీ చేయరు.. ఈ పాస్‌ల గడువు ముగిసిన తర్వాత బస్సుల్లో జీరోఫేర్ టికెట్లు ఇస్తారు. అంటే పాస్ టైం ముగిసే వరకు వారికి ఫ్రీ బస్ ఛాన్స్ లేదంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *