ప్రభుత్వ వాహనం వివాదంపై నిధి అగర్వాల్ క్లారిటీ..!

సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఓ వివాదంపై ప్రముఖ నటి నిధి అగర్వాల్ స్పందించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో ఓ స్టోర్ ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు ఆమె ప్రభుత్వ వాహనాన్ని ఉపయోగించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అసలు విషయం వివరిస్తూ ఆమె సోషల్ మీడియా వేదికగా ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

 

భీమవరంలో జరిగిన కార్యక్రమానికి నిధి అగర్వాల్ ఏపీ ప్రభుత్వానికి చెందిన వాహనంలో రావడంపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ అధికారులే ఆమె కోసం ప్రత్యేకంగా ఆ వాహనాన్ని పంపారని కొన్ని మీడియా కథనాలు, సోషల్ మీడియా పోస్టులు ప్రచారం చేశాయి. ఈ వార్తలు వైరల్ కావడంతో నిధి అగర్వాల్ స్వయంగా స్పందించి వివరణ ఇచ్చారు.

 

“భీమవరం పర్యటన సందర్భంగా స్థానిక కార్యక్రమ నిర్వాహకులే నాకు రవాణా సౌకర్యం కల్పించారు. వారు ఏర్పాటు చేసిన కారు ప్రభుత్వానికి చెందింది. ఆ వాహనాన్ని ఎంపిక చేసుకోవడంలో గానీ, కావాలని అడగడంలో గానీ నా పాత్ర ఏమాత్రం లేదు. కేవలం లాజిస్టికల్ అవసరాల కోసమే నిర్వాహకులు దానిని సమకూర్చారు” అని ఆమె తన ప్రకటనలో స్పష్టంగా పేర్కొన్నారు.

 

అధికారులు తనకు వాహనాన్ని పంపారంటూ వస్తున్న వార్తలను కూడా ఆమె ఖండించారు. “ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. ఈ విషయంలో ప్రభుత్వ అధికారులతో నాకు ఎలాంటి సంబంధమూ లేదు” అని ఆమె తేల్చి చెప్పారు. అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఎలాంటి తప్పుడు సమాచారం చేరకూడదనే ఉద్దేశంతోనే ఈ వివరణ ఇస్తున్నట్లు నిధి తెలిపారు. తనపై ప్రేమ చూపిస్తున్న అభిమానులకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. కాగా, నిధి అగర్వాల్ ఇటీవల పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘హరి హర వీర మల్లు’ చిత్రంలో పంచమి పాత్రలో కనిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *