పులివెందుల జెడ్పీ బైపోల్.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు..

పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు మంగళవారం ఉదయం కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఆయనను కడపకు తరలించారు. ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టు విషయం తెలియగానే వైసీపీ నేతలు మండిపడ్డారు.

 

మాజీ సీఎం జగన్ పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల, ఒంటిమిట్టలో జడ్పీటీసీ స్థానలకు ఉప ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం మొదలైంది. ఉప ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని పోలీసులు ఈ ఉదయం అరెస్టు చేశారు పోలీసులు.

 

పార్టీ కార్యకర్తలను ఆయన రెచ్చగొడుతున్నట్లు పోలీసులకు స్పష్టమైన సమాచారం నేపథ్యంలో గతరాత్రి ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. ఎక్కడకక్కడ పోలీసులు మొహరించారు. మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అక్కడి నుంచి కడప తరలించారు. అరెస్టు నేపథ్యంలో అవినాష్‌రెడ్డి పోలీసులను ప్రతిఘటించారు.

 

నేతలను తొలగించిన పోలీసులు చివరకు అరెస్ట చేశారు. దీనిపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నేతల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి పోలీసులు తనను అక్రమ అరెస్టు చేశారని అన్నారు. పోలీసులకు చిత్తశుద్ది ఉంటే పోలింగ్ కేంద్రాల వద్ద బయటనుంచి వచ్చినవారిని కట్టడి చేయాలన్నారు. అలాంటివారిని వదిలేసి తప్పుడు పనులు చేస్తున్నారని మండిపడ్డారు.

 

పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికను టీడీపీ-వైసీపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. స్థానిక సంస్థల ఎన్నిక కావడంతో బ్యాలెట్‌ పద్దతిలో పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు మండలాల్లో 1500 మంది పోలీసులు మొహరించారు.

 

పులివెందుల జడ్పీటీసీ సీటు కోసం 11 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. టీడీపీ నుంచి బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నుంచి హేమంత్‌రెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ ఎన్నికల బ‌రిలో ఉన్నాడు. మొత్తం 10,600 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

 

అన్ని చోట్ల వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లను జిల్లా అధికారులు చేశారు. ఒంటి మిట్టలో వెబ్‌కాస్టింగ్ లేని కేంద్రాల్లో మైక్రో-ఆబ్జర్వర్స్‌ను అధికారులు నియమించారు.ఏపీఎస్‌పీ బెటాలియన్, డ్రోన్స్, మొబైల్ సర్వైలెన్స్ వాహనాలతో సహా అన్నిస్థాయిల్లో భద్రతా కట్టుదిట్టం చేశారు పోలీసులు. అలాగే వైసీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సతీష్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.

 

ఉప ఎన్నికల నేపథ్యంలో పులివెందులలో హైటెన్షన్ నెలకొంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత పులివెందులలో ఈ ఎన్నిక జరుగుతోంది. పులివెందులలో జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడూ ఏకగ్రీవమే. వైఎస్ కంచుకోటలో పసుపు జెండా ఎగురుతుందా? లేకుంటే జడ్పీటీసీ స్థానం గెలిచి వైసీపీ పట్టు నిలుపుకుంటుందా? అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *