చిన్న పట్టణాలకూ ఐటీ..! కేటిఆర్ కీలక వ్యాఖ్యలు..!

చిన్న పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరించే విషయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తన కృషిని కొనసాగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు.

 

ఆదివారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ, “కేసీఆర్ ప్రభుత్వ హయాంలో టైర్-2 నగరాలకు ఐటీని తీసుకెళ్లడం మా ప్రాధాన్యతగా ఉండేది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడానికి కృషి చేస్తుందని ఆశిస్తున్నాను” అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో నల్గొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, సిద్దిపేటతో పాటు ఆదిలాబాద్‌లోనూ ఐటీ హబ్‌లను ప్రారంభించామని ఆయన గుర్తుచేశారు. చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలకు ప్లగ్-అండ్-ప్లే సౌకర్యాలు కల్పించడం, స్టార్టప్ వాతావరణాన్ని ప్రోత్సహించడం, టాస్క్ కేంద్రాల ద్వారా నైపుణ్యాభివృద్ధి అందించడం తమ లక్ష్యమని వివరించారు.

 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదిలాబాద్ ఐటీ టవర్‌ను రూ. 40 కోట్ల అంచనా వ్యయంతో మంజూరు చేసింది. నిర్మాణ వ్యయం రూ. 58 కోట్లకు పెరిగినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేసి పనులను కొనసాగిస్తోంది. ఈ టవర్ పూర్తయితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. సుమారు 68,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ జీ+4 భవనంలో 635 మంది ఉద్యోగులు పనిచేసేందుకు వీలుంటుంది. మూడు షిఫ్టుల్లో కలిపి దాదాపు 1,900 మందికి ఉపాధి లభించనుంది.

 

టైర్-2 నగరాల్లోని ఐటీ టవర్లలో పూర్తిస్థాయిలో కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించేలా చూసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కంపెనీలను ఆకర్షించేందుకు మెరుగైన రోడ్లు, 24 గంటల విద్యుత్, ఫైబర్ కనెక్టివిటీ వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. ఐటీ అభివృద్ధిని కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా, రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేయడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *