స్మార్ట్ మీటర్లపై మంత్రి గొట్టిపాటి కీలక ప్రకటన..!

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపుపై వామపక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్న విషయం విదితమే. స్మార్ట్ మీటర్ల వల్ల అధికంగా బిల్లులు వస్తున్నాయన్న ప్రచారంతో చాలా మంది వినియోగదారులు వీటి బిగింపును వ్యతిరేకిస్తున్నారు.

 

ఈ క్రమంలో స్మార్ట్ మీటర్ల అంశంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టతనిచ్చారు. ప్రజల అంగీకారం లేకుండా ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగించవద్దని అధికారులను ఆదేశించారు. ప్రజామోదం లేకుండా ఏ విషయంలోనూ ముందుకు వెళ్లకూడదని అన్నారు. విశాఖపట్నంలో నిన్న మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

 

పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు మాత్రమే ప్రస్తుతం స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగానికి వీటిని బిగించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో స్మార్ట్ మీటర్లపై తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

 

పీఎం సూర్య ఘర్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రతి నియోజకవర్గంలో 10 వేల కనెక్షన్లు ఇవ్వాలని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో లోఓల్టేజ్ సమస్యలను పరిష్కరించాలని ఏపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్‌ను మంత్రి ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *