ఏపీ లిక్కర్ కేసులో దర్యాప్తు వేగం వెలుగులోకి సంచలన విషయాలు..! డిజిటల్ లావాదేవీలపై కీలక సమాచారం..?

ఏపీ లిక్కర్ కేసులో దర్యాప్తు వేగం పెరిగిన కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేపో మాపో కీలక నిందితుడు ఎంపీ మిథున్‌రెడ్డి విచారణకు తీసుకోనున్నారు సిట్ అధికారులు. ఆయన్ని విచారించిన తర్వాత కొందరికి నోటీసులు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు.

 

ఇదిలావుండగా ఈ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి. లిక్కర్ కేసులో తన ప్రమేయం లేదని కుండ బద్దలు కొట్టేశారు. లిక్కర్ కుంభకోణంలో కొందరు అక్రమంగా సంపాదించి ఉండొచ్చని, తాను మాత్రం నిజాయతీగా వ్యవహరించానని మనసులోని మాట బయటపెట్టేశారు.

 

డిజిటల్ లావాదేవీలు వద్దని తాను చెప్పిన మాట వాస్తవమేనని తెలిపారు. విచారణ సమయంలో సిట్‍కు అన్ని విధాలుగా సహకరిస్తానని తెలిపారు. కొందరు వైసీపీ నేతలు తనను ఇరికించాలని చూస్తున్నారని బాంబు పేల్చారు. ఇంతకీ ఆ నేతలు ఎవరన్నది ఆ పార్టీలో అప్పుడే చర్చ మొదలైంది.

 

నార్మల్‌గా సోమవారం సిట్ విచారణకు నారాయణస్వామి హాజరు కావాల్సిఉంది. అనారోగ్య కారణాల రీత్యా ప్రస్తుతం రాలేదని అధికారులకు ఆయన సమాచారం ఇచ్చారు. ఆ మరుసటి రోజు ఆయన ఈ విధంగా మాట్లాడడం పార్టీలో ఏదో జరుగుతోందన్న అనుమానాలు మొదలయ్యాయి.

 

లిక్కర్ కుంభకోణం సమయంలో నారాయణస్వామి ఎక్సైజ్ శాఖకు మంత్రిగా వ్యవహరించారు. ఆ సమయంలో కొన్ని విషయాలు బయటపెట్టారు. మరి విచారణలో ఆయన ఇంకెన్ని విషయాలు బయట పెడతారోనని అంటున్నారు. చాలామంది నారాయణస్వామిని మరో సాయిరెడ్డిగా చెబుతున్నారు.

 

లిక్కర్ కుంభకోణంలో ఆయన్ని ఆ పార్టీ నేతలు ఇరికించాలని ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. దీనివెనుక ఏదో జరుగుతోందని అంటున్నారు. ఆయన్ని సిట్ విచారిస్తే ఆ ఇద్దరు నేతలు ఎవరన్నది బయటకు రానుంది. మొత్తానికి లిక్కర్ కేసు నుంచి ఎవరికి వారు బయటపడేందుకు ప్రయత్నాలు మొదలుపెడుతున్నట్లు కనిపిస్తోంది.

 

ఈ కేసులో 48 మందిలో నిందితులుగా ఉన్నారు. వారిలో 12 మంది అరెస్టయ్యారు. 8 మంది విదేశాల్లో ఉన్నారు. ఇంకా ఆ 28 మంది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. మిథున్ రెడ్డిని విచారించిన తర్వాత నేతలు-అధికారులకు నోటీసులు ఇవ్వాలని ప్లాన్ చేస్తోందట సిట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *