నంద్యాల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..

సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. సీమ జిల్లాలకు నెలాఖరుకల్లా కృష్ణా జలాలను తరలిస్తామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకునే సమయం ఆసన్నమైంది. ఇచ్చిన మాటకు కట్టుబడి నేడు నీరు విడుదల చేయనున్నారు. మూడు ఉమ్మడి రాయలసీమ జిల్లాలకు నీరందరించే హంద్రీ-నీవా ప్రధాన కాలువ విస్తరణ పనులు పూర్తయ్యే దశకు చేరుకోవడంతో.. మల్యాల ఎత్తిపోతల నుంచి నీటిని విడుదల చేయనున్నారు. దీని కోసం నంద్యాల జిల్లాలో సీఎం పర్యటించనున్నారు.

 

మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద కృష్ణమ్మకు జల హారతి

ఈ రోజు ప్రత్యేక విమానంలో ఓర్వకల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న తర్వాత.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో అల్లూరు గ్రామానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా మల్యాల పంపింగ్ స్టేషన్‌కు చేరుకొని రైతులతో ముఖాముకి కానున్నారు. మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద కృష్ణమ్మకు జల హారతి ఇచ్చిన అనంతరం నీటిని విడుదల చేయనున్నారు.

 

హంద్రీ-నీవాకు నీరు విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు

హంద్రీనీవా ఫేజ్ వన్‌ కాలువల విస్తరణ పనులు పూర్తి కావటంతో సీమ జిల్లాలు సస్యశ్యామలం కానున్నాయి. వంద రోజుల్లో ఈ కాలువ విస్తరణ పనులు 696 కోట్లతో చేపట్టారు. ఈ విస్తరణ పనులతో హంద్రీనీవా ఫేజ్ 1 కాలువ ప్రవాహ సామర్ధ్యం 3 వేల 850 క్యూసెక్కులకు పెరిగింది. గతంలో కంటే ఇది 1600 క్యూసెక్కులు అదనం. అనంతపురం జిల్లాలో ఉన్న జీడిపల్లి రిజర్వాయర్‌ను పూర్తి సామర్ధ్యంతో నీటిని నింపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఆయకట్టుకు సాగునీరు, 33 లక్షల మంది ప్రజలకు దాహార్తిని తీర్చడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.

 

వంద రోజుల్లో పూర్తైన కాలువ విస్తరణ పనులు

మల్యాల నుంచి జీడిపల్లి వరకూ 216 కిలోమీటర్ల మేర హంద్రీనీవా కాలువ విస్తరణ పనులు పూర్తి అయ్యాయి. దీంతో జీడిపల్లి, కృష్ణగిరి, పత్తికొండ, గాజులదిన్నె సహా స్థానికంగా రాయలసీమ జిల్లాల్లోని చెరువులను కూడా నీటితో నింపనున్నారు. ఇలా చేయడం ద్వారా సీమ జిల్లాల్లో భూగర్భజలాలు గణనీయంగా పెరిగేందుకు అవకాశం ఉంది. నెలకు దాదాపు 4.27 టీఎంసీల చొప్పున నాలుగు నెలల వరద కాలంలో అదనంగా 17.10 టీఎంసీల నీటిని తీసుకునేందుకు అవకాశం ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *