కోవిడ్-19 మహమ్మారి కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కార్డుదారులు, రాష్ట్ర ప్రజాపంపిణీ వ్యవస్థ లబ్దిదారులకు భారీ స్థాయిలో ఆహార ధాన్యాలను ఉచితంగా అందజేసిందని ఎఫ్ సి ఐ రీజనల్ మేనేజర్ అశ్వని కుమార్ గుప్తా తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద జరుగుతున్న ఈ కార్యక్రమంలో తెలంగాణలో ఇప్పటి వరకు నాలుగు దశల్లో 14.37 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను మంజూరు చేయడమే కాకుండా రాష్ట్రం వినియోగించుకోడానికి లిఫ్ట్ చేసిందని, దీని కోసం అయ్యే రూ. 5355 కోట్ల ఖర్చును కేంద్రమే భరిస్తుందని తెలిపారు.
కోవిడ్ మహమ్మారి ప్రబలిన వెంటనే ప్రజలను ఆదుకోడానికి ప్రతి వ్యక్తికీ నెలకు 5 కిలోల చొప్పున 80 కోట్ల మంది లబ్దిదారులకు ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేసే భారీ కార్యక్రమాన్ని కేంద్రం పీఎంజీకేఏవై కింద గత ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించింది. ఆహారభద్రత కార్డులున్న లబ్దిదారులకు ఆహార ధాన్యాలను ఇవ్వాలని సంకల్పించింది కేంద్రం. ఒక మెట్రిక్ టన్నుకు సుమారు రూ.37,261 ఖర్చు అవుతుందని అంచనా వేసిన కేంద్రం మొత్తం ఖర్చును పీఎంజీకేఏవై పథకం కింద భరించడానికి నిర్ణయించింది. మొదటి మూడు నెలలకు ఇవ్వాలని ప్రారంభించిన ఈ పథకాన్ని ఆ తర్వాత రెండో దశలో మరో 5 నెలలు అంటే 2020 నవంబర్ వరకు పొడిగించింది. అయితే రెండో వేవ్ ప్రారంభమై అనేక మంది పేద వారి పరిస్థితి క్లిష్టంగా మారడంతో మూడో దశలో పీఎంజీకేఏవైని 2021 మే, జూన్ నెలల్లో అమలు చేసింది.
అయితే ప్రజలను ప్రస్తుత సమయంలో ఆదుకోవాల్సిన అవసరం ఉందని భావించి, నాలుగో దశలో ఈ పథకాన్ని 2021 నవంబర్ వరకు అమలు చేయాలని మరో 5 నెలలు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణాలో 1.97 కోట్ల ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులు ఈ పథకం కింద లబ్ది పొందుతున్నారని, వీరికి నెలకు 1.08 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటి) ఆహారధాన్యాలను అందజేస్తున్నట్లు గుప్తా తెలిపారు. దీంతో పాటు అదనంగా నెలకు 95,810 మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలను తెలంగాణకు కేటాయించడం జరిగింది. ఈ ఆహారధాన్యాలను కేంద్రమే ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించడంతో ఒక్క తెలంగాణ రాష్ట్రంలో నెలకు అయ్యే సుమారు రూ.357 కోట్ల ఖర్చును కేంద్రం భరిస్తోందని గుప్తా తెలిపారు.