మాజీ సీఎం కేసీఆర్ ఇటీవల తరచూ అనారోగ్య సమస్యలతో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆస్పత్రికి వెళ్లారన్న వార్త బయటకొచ్చిన ప్రతిసారీ ఆయన ఆరోగ్యంపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా మరోసారి ఆయన ఆస్పత్రికి వెళ్లగా, సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినపడ్డాయి. చివరకు ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, రొటీన్ హెల్త్ చెకప్ మాత్రమేనని బీఆర్ఎస్ అధికారికంగా ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. అక్కడికీ జనం నమ్మరు అనుకున్నారో ఏమో ఆస్పత్రి నుంచే కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నట్టు ఓ వీడియో విడుదల చేశారు, పార్టీ నేతలతో ఆయన సమావేశం అయిన ఫొటోలను బయటపెట్టారు.
కేసీఆర్ కి ఏమయింది..?
2024 ఎన్నికల తర్వాత కేసీఆర్ కాలు ఫ్రాక్చర్ కావడంతో కొన్నాళ్లు ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆ తర్వాత కూడా ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నారు. మరోసారి రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం అంటూ ఆస్పత్రిలో చేరారు. తాజాగా మళ్లీ ఆయన ఆస్పత్రిలో చేరడంతో బీఆర్ఎస్ నేతలు కూడా ఆందోళన పడ్డారు. అధినాయకుడికి ఏం జరిగింది..? ఉన్నట్టుండి ఎందుకు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని ఆరాలు తీశారు. అయితి వెంటనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రొటీన్ హెల్త్ చెకప్‌లో భాగంగా కేసీఆర్ ఆస్పత్రిలో చేరారని, ఆయన బ్లడ్ షుగర్, సోడియం లెవెల్స్ మానిటర్ చేయడం కోసం ఒకటి, రెండు రోజులు ఆసుపత్రిలో చేరాల్సిందిగా డాక్టర్లు సూచించారని ట్వీట్ చేశారు. కేసీఆర్ ఆరోగ్యం సమాచారం అడుగుతూ, ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్.
అయితే ఇక్కడ కేసీఆర్ వీడియో సడన్ గా బయటకు రావడం విశేషం. సహజంగా ఆస్పత్రిలో ఉన్న పేషెంట్ ని పరామర్శించేందుకు ఎవరైనా వస్తే ఒకరిద్దర్ని మాత్రమే రూమ్ లోకి పంపిస్తారు. కానీ బీఆర్ఎస్ నేతలంతా ఒకేసారి కేసీఆర్ ని కలిసేందుకు వెళ్లారు. ఆయన కూడా ఒక పెద్ద హాల్ లో అందర్నీ సమావేశపరిచారు. రాజకీయ సమావేశం లాగా ఆ మీటింగ్ జరిగింది. కేటీఆర్, హరీష్ రావు సహా ఇతర నేతలు ఆయనతో భేటీ అయ్యారు. అక్కడ రాజకీయ చర్చలు జరిగినట్టు ఆ పార్టీయే అధికారికంగా ప్రకటించడం విశేషం. నేతలతో ఇష్టాగోష్టి నిర్వహించిన కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు, తదితర ప్రజా సమస్యలు, వర్తమాన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారన్నారు. పార్టీ నేతలు, ఉద్యమకారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారని తెలిపారు.
అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్, సొంత పార్టీ నేతలను కూడా పెద్దగా కలవడం లేదు. ఎక్కువగా ఫామ్ హౌస్ కే పరిమితం అవుతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన సరిగా హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో ఆయన పొలిటికల్ భేటీ నిర్వహించడం ఆశ్చర్యంగా మారింది. కేవలం పుకార్లకు చెక్ పెట్టడం కోసమే కేసీఆర్ వీడియోని బయటకు వదిలారని అంటున్నారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పేందుకే ఆయనతో పాటు పార్టీ నేతలు కలసి ఉన్న ఫొటోలు, వీడియోలను బయటపెట్టినట్టుగా తెలుస్తోంది.