గిరిజనులకు పవన్ కల్యాణ్ ప్రత్యేక కానుక.. ఇంటింటికీ..

గిరిజనులపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని, ఆత్మీయతను మరోసారి చాటుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. తన వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పద్ధతుల్లో పండించిన మామిడి పండ్లను గిరిజన గ్రామస్థులకు పంపించారు. తమ కోసం పవన్ పంపిన మామిడి పండ్లు పంపడంతో ఆనందంలో ముగినిపోయారు ఆ గ్రామవాసులు.

 

ఏజెన్సీ ప్రాంతాలే కాదు.. అక్కడి ప్రజలన్నా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అభిమానం అంతా ఇంతా కాదు. ఆ ప్రాంత గిరిజనులపై ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. అల్లూరి జిల్లా కురిడి గ్రామస్థుల కోసం మామిడిపండ్లను పంపించారు డిప్యూట సీఎం. తన తోటలో ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేశారు మామిడిపండ్లు. ఆ ప్రాంత గిరిజనులకు పండిన మామిడి ఇవ్వాలని తన సిబ్బందిని ఆదేశించారు.

 

గురువారం ప్రత్యేక వాహనంలో కురిడి గ్రామానికి చేరుకున్నారు డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది. ఆ ప్రాంతంలో దాదాపు 230 వరకు ఇళ్లు ఉన్నాయి. ఇంటికి అరడజను చొప్పున మామిడి పండ్లను సిబ్బంది పంపిణీ చేశారు. పవన్ కల్యాణ్ పంపిన ఆ మామిడిపండ్లు అత్యంత ఇష్టంతో పిల్లలు,పెద్దలు ఇష్టంగా తిన్నారు. పవన్ సారు.. చల్లగా ఉండాలంటూ ఆ ప్రాంత గిరిజనులు ఆశీర్వదించారు.

 

కొద్దిరోజుల కిందట అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా అల్లూరి జిల్లాకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళ్లారు. డుంబ్రిగూడ మండలం పెద్దపాడు, కురిడి గ్రామాల్లో పర్యటించారు. ఆ గ్రామాల ప్రజల కష్టాలను తీర్చేందుకు అక్కడ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. ఆ గ్రామస్థులతో స్వయంగా మాట్లాడి వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు పవన్ కల్యాణ్.

 

ఈ సందర్భంగా కురిడి గ్రామంలోని ఓ శివాలయంలో పూజలు చేసి మొక్కు తీర్చుకున్నారు. గ్రామస్తుల పరిస్థితిని అర్థం చేసుకొన్న డిప్యూటీ సీఎం, మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టారు. పర్యటన సందర్భంగా వారితో ఏర్పడిన అనుబంధంతో వారికి తన తోటలోని పండిన మామిడని పంపించారు.

 

దీంతో ఆ గ్రామవాసులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో చాలా గ్రామాలున్నా, కురిడి గ్రామానికి అదృష్టం దక్కిందని అంటున్నారు. ఇక ఆ ప్రాంతం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, అన్ని సదుపాయాలు వస్తాయని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *