ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకం ఎట్టకేలకు కార్యరూపం దాల్చబోతోంది. ఎప్పుడు ప్రారంభమవుతుందో? ఎలా అమలు చేస్తారు? అన్న సందేహాలకు ఇక ఎండ్ కార్డు పడింది. కానీ అసలు విషయం ఏంటంటే, ఇది కేవలం ప్రయాణమే కాదు.. ఒక సామాజిక మార్పు, ఓ ఆర్థిక స్వాతంత్ర్య దిశగా తొలి అడుగు. ఈ కథనం పూర్తిగా చదివితే మీరే అర్థం చేసుకుంటారు అసలు విషయాన్ని.
పథకంపై రాష్ట్ర ప్రభుత్వ స్థాయి చర్చలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టేందుకు గట్టి కసరత్తు మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న తాజా సమీక్షలలో ఈ పథకాన్ని ఆగస్టు 15, 2025 నుండి అమలు చేయాలని స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగా అవసరమైన బస్సులు, మౌలిక వసతులు, ఆర్థిక వనరులపై ఇప్పటికే అధికార యంత్రాంగం పని మొదలుపెట్టింది.
విస్తృతంగా అమలు.. కొత్త బస్సుల అవసరం
ప్రస్తుత APSRTC వద్ద ఉన్న బస్సుల సరిపడదని అంచనా వేసిన ప్రభుత్వం, అదనంగా 2,536 బస్సులు అవసరమని గుర్తించింది. అందులో సగానికి పైగా పథకానికి ప్రత్యేకంగా ఉపయోగించనున్నట్లు సమాచారం. ఈ బస్సుల కొనుగోలు కోసం సుమారు రూ. 996 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. కొత్తగా తీసుకొచ్చే బస్సులను ఆయా ప్రాంతాల్లోని ఆక్యుపెన్సీ అనుగుణంగా పంపిణీ చేయనున్నారు.
ఇక RTCలో ఎలక్ట్రిక్ వాహనాలే.. గ్రీన్ ట్రావెల్ వైపు అడుగు
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఇకపై APSRTCకి తీసుకొచ్చే ప్రతి బస్సు ఎలక్ట్రిక్ వెహికల్ గా ఉండాలని నిర్ణయించారు. దీని ద్వారా పర్యావరణ హానిని తగ్గించడమే కాకుండా, నిర్వహణ ఖర్చులను కూడా తగ్గించగలమని నమ్మకం. వాతావరణం పట్ల బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తోంది.
ఆర్థిక భారమైనా..
ఈ పథకం అమలు చేయడానికి ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. కానీ రాష్ట్రంలోని లక్షలాది పేద, మధ్యతరగతి మహిళలు ప్రయాణ ఖర్చుతో తలమునకలై ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ప్రత్యేకించి ఉపాధి కోసం ప్రయాణించే మహిళలకు ఇది ఒక ఆర్థిక ఉపశమనం.
ఎవరెవరికి లాభం? ఎలా పొందాలి?
ఈ పథకం కింద సర్కారీ RTC బస్సుల్లో ప్రయాణించే అందరూ మహిళలకు ఉచిత టికెట్ లభిస్తుంది. టౌన్ సర్వీసులు, పల్లెవెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్ వంటి సాధారణ సర్వీసులకు ఇది వర్తిస్తుంది. ప్రైవేట్ బస్సులకు ఇది వర్తించదు. ప్రయాణ సమయంలో ఆధార్ కార్డు, మహిళల గుర్తింపు కార్డు వంటి ఆధారాలతో ఉచిత ప్రయాణం పొందవచ్చు.
డిజిటల్ టికెటింగ్ – ట్రాన్స్పరెన్సీ
ఈ పథకాన్ని ట్రాక్ చేయడానికి RTC డిజిటల్ టికెటింగ్ సిస్టమ్ వినియోగించనుంది. ప్రతి ఉచిత ప్రయాణం డేటా రూపంలో సేవ్ అవుతుంది. వృథా ప్రయాణాలు, డూప్లికేట్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ పథకం ఒక్క ఉచిత ప్రయాణానికి సంబంధించినదే కాదు. ఇది మహిళా సాధికారత, ఉపాధి అవకాశాలు, ఆర్థిక భారం నుండి విముక్తి, అన్నీ కలబోసిన వినూత్న కార్యక్రమం. ఇప్పటివరకు మనం మాటల్లో చెప్పుకునే సమాన హక్కులు.. ఇప్పుడు బస్సులో టికెట్ రూపంలో కనిపించబోతున్నాయి. ప్రతి మహిళకు ఈ ప్రయోజనం అందేలా చూడటం భాద్యతగా ప్రభుత్వం భావిస్తోంది