రాజస్థాన్ లో 3,500 ఏళ్ల నాటి పురాతన నది ఆనవాళ్లు..!

రాజస్థాన్‌లోని దీగ్ జిల్లా బహాజ్ గ్రామంలో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) జరిపిన తవ్వకాల్లో ఓ అద్భుత ఆవిష్కరణ వెలుగుచూసింది. భూమికి 23 మీటర్ల లోతున ఒక ప్రాచీన నదీ ప్రవాహ మార్గం (పాలియోఛానల్) బయటపడింది. ఇది వేదాల్లో ప్రస్తావించిన సరస్వతీ నది జాడలు కావచ్చని, భారత పురావస్తు చరిత్రలోనే ఇది అపూర్వమైన ఆవిష్కరణ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

ఏప్రిల్ 2024 నుంచి ఈ ఏడాది మే వరకు సాగిన ఈ తవ్వకాల్లో క్రీస్తుపూర్వం 3500 నుంచి 1000 మధ్య కాలంలో ఇక్కడ నాగరికత విలసిల్లినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. “ఈ ప్రాచీన నదీ వ్యవస్థ ఆనాటి మానవ ఆవాసాలకు జీవనాధారంగా నిలిచి, బహాజ్ గ్రామాన్ని విస్తృతమైన సరస్వతీ నదీ పరీవాహక సంస్కృతితో కలుపుతుంది” అని ఏఎస్ఐ జైపూర్ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ వినయ్ గుప్తా తెలిపారు. కుషానులు, మగధ, శుంగ వంశాల కాలంనాటి అవశేషాలు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి.

 

తవ్వకాల్లో మట్టి స్తంభాల నివాస గృహాలు, పొరలుపొరలుగా ఉన్న గోడల కందకాలు, కొలిమిలు, వివిధ ఇనుప, రాగి వస్తువులు బయల్పడ్డాయి. సూక్ష్మశిలా పరికరాలు హోలోసీన్ పూర్వ కాలం నుంచే ఇక్కడ మానవ ఉనికిని సూచిస్తున్నాయి. క్రీ.పూ. 1000 నాటి 15 యజ్ఞకుండాలు, శక్తి ఆరాధన మొక్కుబడి చెరువులు, శివపార్వతుల మట్టి విగ్రహాలు ఆధ్యాత్మిక జీవనానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

 

ముఖ్యంగా, బ్రాహ్మీ లిపి అక్షరాలున్న నాలుగు కాల్చని ముద్రికలు (సీలింగ్స్) లభించాయి. ఇవి భారత ఉపఖండంలో బ్రాహ్మీ లిపికి సంబంధించిన అత్యంత పురాతన, కాలాన్ని నిర్ధారించదగిన ఆధారాలు కావచ్చని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. మహాజనపదాల కాలం నాటి యజ్ఞకుండాలలో అక్షరాలు లేని రాగి నాణేలు దొరకడం, నాణేల ఆవిర్భావ చరిత్రపై కొత్త వెలుగునిచ్చే అవకాశముంది. ఎముకల పనిముట్లు, విలువైన రాళ్లు, శంఖు గాజులు ఆనాటి హస్తకళా నైపుణ్యాన్ని చాటుతున్నాయి. ఈ తవ్వకాలు భారతదేశ చరిత్రలోని కీలక అధ్యాయాలను తిరగరాయగలవని వినయ్ గుప్తా పేర్కొన్నారు. ఈ స్థల పరిరక్షణకు ఏఎస్ఐ సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *