నేడు ఏపీ కేబినెట్ భేటీ .. ఈ కీలక అంశాలపై చర్చ..!

ఈ రోజు ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

 

7వ ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదం పొందిన 19 ప్రాజెక్టులకు సంబంధించిన రూ.28,546 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అంతేకాకుండా, రాజధాని ప్రాంతంలో 1450 ఎకరాలలో మౌలిక వసతుల కల్పనకు రూ.1052 కోట్లతో టెండర్లు పిలవడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలుపనుంది. సీడ్ యాక్సెస్ రోడ్డును జాతీయ రహదారి 16కి అనుసంధానం చేయడానికి రూ.682 కోట్లతో టెండర్లు ఆహ్వానించే అంశంపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు.

 

అమరావతి ప్రాంతంలో రెండవ దశలో 44 వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించే అంశం, కొన్ని సంస్థలకు భూ కేటాయింపులు వంటి అంశాలపై చర్చించి కేబినెట్ ఆమోదం తెలపనుంది. త్వరలో అమలు చేయనున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన విధి విధానాలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో చర్చించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *