హెచ్ఐవీ నివారణకు వచ్చేసింది టీకా..!

హెచ్ఐవీ మహమ్మారిపై దశాబ్దాలుగా సాగుతున్న పోరాటంలో ఒక కీలకమైన ముందడుగు పడింది. హెచ్ఐవీని సమర్థవంతంగా నిరోధించగల సరికొత్త దీర్ఘకాలిక ఔషధం ‘లెనకాపవిర్’ (బ్రాండ్ పేరు: యెజ్టుగో)కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) ఆమోదం తెలిపింది. ఏడాదికి కేవలం రెండు ఇంజెక్షన్లు తీసుకోవడం ద్వారా హెచ్ఐవీ నుంచి దాదాపు పూర్తిస్థాయిలో రక్షణ పొందవచ్చని తేలడం ప్రపంచవ్యాప్తంగా ఆశలు రేకెత్తిస్తోంది.

 

ప్రస్తుతం హెచ్ఐవీ నివారణకు ప్రీ-ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్ (ప్రెప్)గా పిలిచే మందులు దశాబ్దాలుగా అందుబాటులో ఉన్నప్పటికీ, రోజూ మాత్రలు వేసుకోవాల్సి రావడం చాలా మందికి ఇబ్బందికరంగా మారింది. అయితే, క్రమశిక్షణ లోపం వల్లే వాటి ప్రభావం పరిమితంగా ఉంటోంది. ఇప్పుడు యెజ్టుగో టీకాను బ్రేక్ త్రూగా భావించవచ్చు. ఈ ఔషధంపై గిలియడ్ రెండుసార్లు నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లోనూ మంచి ఫలితాలు వచ్చాయి. ఒకదాంట్లో వందకు 100 శాతం ఫలితాలు రాగా, రెండో దాంట్లో 99.9 శాతం ఫలితాలు కనిపించాయి. అయితే, ఇంజెక్షన్ తీసుకున్న ప్రదేశంలో నొప్పి, తలనొప్పి, వికారం వంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కనిపించినట్లు నివేదికలు తెలిపాయి.

 

ధరపై ఆందోళనలు.. అందరికీ అందుబాటులోకి వస్తుందా?

లెనకాపవిర్ టీకా అద్భుతమైన ఫలితాలు సాధించినప్పటికీ ఈ ఔషధం ధర ఎక్కువగా ఉండొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో, ప్రతి రెండు నెలలకు ఒకసారి ఇంజెక్షన్ ద్వారా తీసుకునే కాబోటెగ్రావిర్ అనే మరో హెచ్ఐవీ నివారణ మందు వార్షిక ఖర్చు పదివేల డాలర్లలో ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇప్పుడీ లెనకాపవిర్ ప్రస్తుత ధర సంవత్సరానికి 39,000 డాలర్లుగా ఉంది. అయితే, నివారణ కోసం వాడినప్పుడు ఈ ధర తగ్గుతుందని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *