విశాఖలో ఓ ఐటీ కంపెనీ క్యాంపస్..!

యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. తాజాగా ఐటీ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ విశాఖలో క్యాంపస్ పెట్టేందుకు ముందుకొచ్చింది. దాదాపు 1583 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. ఈ కంపెనీ ద్వారా 8 వేలు ఉద్యోగాలు రానున్నాయి. కొద్దిరోజుల్లో క్యాంపస్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది.

 

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తోంది కూటమి సర్కార్. సీఎం చంద్రబాబు పెద్ద పెద్ద కంపెనీలు అక్కడికి రప్పించేందుకు కృషి చేస్తున్నారు. ఇందులోభాగంగా ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్‌ విశాఖకు రానుంది. దావోస్‌లో జరిగిన సమావేశంలో మంత్రి లోకేష్.. కాగ్నిజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రవికుమార్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

 

టైర్-2 సిటీల్లో తమ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తున్నట్లు చెప్పారు. అందుకు విశాఖ సిటీ అనువుగా ఉంటుందన్నారు. ఇప్పటికే అక్కడ చాలా కంపెనీలు ఉన్నాయని గుర్తు చేశారు సదరు మంత్రి. దీనికి సంబంధించి తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 

కాపులుప్పాడలో తమ క్యాంపస్‌కు 21 ఎకరాలపైనే భూమిని కేటాయించాలని విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీని కోరింది. ఎకరా కేవలం 99 పైసల నామ మాత్రపు రేటుకు భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు ఓ అధికారి మాట. మొత్తం మూడు దశలుగా విశాఖలో 8 వేల ఉద్యోగాలు రానున్నాయి.

 

సరిగ్గా ఎన్నికల ఏడాది నాటికి కాగ్నిజెంట్ తన కార్యకలాపాలు మొదలుపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడిప్పుడే ఐటీ హబ్‌గా మారుతోంది విశాఖ. కాగ్నిజెంట్ రావడంతో యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని భావిస్తోంది. దీనిపై మంత్రి లోకేష్ నోరు విప్పారు. త్వరలో కాగ్నిజెంట్‌పై ప్రకటన చేస్తామని తెలిపారు. దావోస్‌లో పారిశ్రామిక‌వేత్తలకు చెప్పిన విషయాలను గుర్తు చేశారు.

 

బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలకు ధీటుగా ఐటీ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం. TCS, ఇన్ఫోసిస్, HCL, అదానీ గ్రూప్ కంపెనీలు విశాఖపై ఫోకస్ చేశాయి. సిటీ చుట్టుపక్కల పెద్ద ఎత్తున ప్రాజెక్టులకు ప్లాన్ చేస్తున్నాయి. గూగుల్ కూడా AI డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *