జగన్ కాన్వాయ్ ఢీకొని..! ఓ వ్యక్తి మృతి..!

గుంటూరు లాల్‌పురం హైవేపై రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వృద్ధుడు మృతి చెందాడు. రెంటపాళ్లకు వెళుతున్న మాజీ సీఎం జగన్‌ కాన్వాయ్‌లోని ఓ వాహనం ఓ వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

 

మృతుడిని వెంగలయపాలెంకు చెందిన సింగయ్యగా గుర్తించారు. అతడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సింగయ్య మృతిపై టీడీపీ స్పందించింది. జగన్ ప్రచార పిచ్చికి మరొకరు బలయ్యారంటూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఇంత ప్రమాదం జరిగినా.. జగన్ కనీసం పట్టించుకోలేదని విమర్శించింది.

 

కాగా.. పల్నాడు రాజకీయం మరోసారి వేడెక్కుతోంది. ఇక్కడ రాజకీయ హింస ఎక్కువ. రాళ్లదాడులు, కత్తిదాడులు కామన్. అలాంటి చోట పార్టీల బలప్రదర్శన అంటే పోలీసులకు సవాలే. అందుకే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన చుట్టూ రాజకీయం వేడెక్కింది.

 

పల్నాడు జిల్లా రెంటపాళ్లకి మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. ఆయన టూర్‌కు పోలీసులు కండిషన్లతో ఓకే చెప్పిన నేపథ్యంలో.. జగన్ పర్యటన హైటెన్షన్ రాజేసింది. వైసీపీ నేత కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్‌ అక్కడికి వెళుతున్నారు. జగన్ పర్యటనతో కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ పర్యటనకు కేవలం వంద మందికి మాత్రమే అనుమతి ఉందని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. శాంతిభద్రతల సమస్య వచ్చే అవకాశం ఉండటంతో.. భారీగా జనసమీకరణ చేయవద్దని సూచించారు. మరోవైపు పోలీసులు విధించిన నిబంధనలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కావాలనే జగన్ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడుతున్నారు.

 

జగన్ పర్యటనపై వైసీపీ, కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ శవ రాజకీయాలు చేస్తోందని టీడీపీ అంటుంటే.. నాగమల్లేశ్వరరావు మృతికి వేధింపులే కారణమని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు జగన్ పర్యటనకు కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలంటూ పిలుపునివ్వడంతో ఇప్పుడు పల్నాడులో ఏం జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం నెలకొంది.

 

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత.. అంటే జూన్‌ 6న నాగమల్లేశ్వరరావు పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు. మూడు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స కొనసాగింది. జూన్‌ 9న ఆయన మృతి చెందారు. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులు గ్రామంలో అతని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించనున్నారు. రెడ్‌బుక్ కారణంగా బలైన తొలి వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు వైసీపీ చెబుతుంటే.. అసలు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాకముందే మృతి చెందిన వారికి.. టీడీపీకి సంబంధం ఏంటన్నది టీడీపీ నేతల ప్రశ్న.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *