బుద్ధి మార్చుకోని జర్నలిస్ట్ కృష్ణంరాజు.. ఆధారాలున్నాయంటూ సమర్థించుకునే యత్నం..!

సాధారణంగా ఎవరైనా తప్పు చేస్తే, ఆ తర్వాతైనా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారు. కానీ, అమరావతి మహిళలను ఉద్దేశించి గతంలో సాక్షి చానెల్‌లో తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజు మాత్రం తన తీరు మార్చుకోవడం లేదు. పైగా, తన వ్యాఖ్యలను సమర్థించుకునేందుకు మరింత వివాదాస్పద చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఆయన తన వ్యాఖ్యలకు ఆధారాలు ఇవిగోనంటూ కొన్ని పాత వార్తా కథనాలను చూపిస్తూ ఒక వీడియోను విడుదల చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

 

గతంలో ఎప్పుడో వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు చేసి కొందరిని అరెస్టు చేసిన పాత వార్తలను సేకరించి, వాటితో కృష్ణంరాజు ఒక వీడియోను రూపొందించారు. సుమారు 8 నిమిషాల 42 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోను “ఏపీటీవీ జర్నలిస్ట్” అనే యూట్యూబ్ చానెల్ ద్వారా విడుదల చేశారు. ఈ చర్య ద్వారా ఆయన ప్రజలను మరింత రెచ్చగొట్టాలని చూస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన అనుచిత వ్యాఖ్యలపై ఇప్పటికే కేసులు నమోదవుతున్నప్పటికీ వెనక్కి తగ్గకపోవడం గమనార్హం.

 

వాస్తవానికి, వ్యభిచార గృహాలపై పోలీసు దాడులు, అరెస్టులు వంటి ఘటనలు దేశంలో ప్రతిరోజు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంటాయి. ప్రతి రాష్ట్ర రాజధానిలోనూ ఇలాంటి ఘటనలు అనేకం కనిపిస్తాయి. అయితే, కృష్ణంరాజు మాత్రం కేవలం అమరావతి ప్రాంతంలోనే ఇటువంటివి జరుగుతున్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, ఇది ఆయన వక్రబుద్ధికి నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు. ఇలాంటి చర్యల ద్వారా అమరావతి ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి, ఒక ప్రాంతంపై ఇలా బురద చల్లే ప్రయత్నం చేయడం తగదని పలువురు హితవు పలుకుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *