మనోహర్ సహా ఇద్దరిపై వైసీపీ వేటు..? అసలు వైసీపీలో ఏం జరుగుతోంది..?

వైసీపీలో ఏం జరుగుతోంది? ఆ ఒక్క కారణంతో మనోహర్ నాయుడిపై వేటు వేసిందా? నేతలు వలస బాట పడుతున్న ఈ పరిస్థితుల్లో వేటు వేయడం అవసరమా? నేతలను ఆకట్టుకోవాల్సిన పార్టీ, వేటు వస్తే తమ పరిస్థితి ఏంటని మిగతా నేతలు ఎందుకంటున్నారు? ఇలాగైతే ఫ్యూచర్ కష్టమనే సంకేతాలు ఇస్తున్నారా? అసలు వైసీపీలో ఏం జరుగుతోంది?

గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడుపై వేటు వేసింది వైసీపీ. ఆయనతోపాటు మరో ఇద్దరు కార్పొరేటర్లను సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నట్లు వైసీపీ వెర్షన్. ఇంతకీ మనోహర్ నాయుడు ఏ విధంగా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారనేది ఆయన మద్దుతుదారుల ప్రశ్న.

పార్టీ అధికారం కోల్పోయినా మిగతా నేతల మాదిరిగా జంప్ చేయకుండా ఉండడమే ఆయన చేసిన నేరమా? అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దీని వెనుక అంతర్గత కలహాలే కారణమన్న వాదనల సైతం లేకపోలేదు. మేయర్ పదవికి మనోహర్ రాజీనామా చేసే క్రమంలో పార్టీకి సమాచారం ఇవ్వలేదట. దీనిపై పార్టీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆపై వేటు వేయడం జరిగిపోయింది.

గుంటూరు జిల్లా వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు మనోహన్ నాయుడు సస్పెన్షన్‌కు కారణమని అంటున్నారు. 2014 ఎన్నికల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాలని మనోహర్ భావించాడు. ఈ క్రమంలో గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. వివిధ సమీకరణల దృష్ట్యా ఆయనకు సీటు కేటాయించలేదు. మొన్నటి ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుంచి విడుదల రజని పోటీ చేశారు.

చివరి నిమిషంలో కావటిని బలవంతంగా చిలకలూరిపేట మార్చారు. చివరకు వైసీపీ నేతలిద్దరు ఓటమి పాలయ్యారు. గుంటూరు వెస్ట్ నుంచి ఆసక్తి ఉన్న నేత, కావటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని హైకమాండ్‌కు పదే పదే ఫిర్యాదు చేశారట. దీంతో ఆయన సస్పెండ్‌కు ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది.

గతంలోకి వెళ్తే.. 2021లో జరిగిన జీఎంసీ ఎన్నికల్లో మెజారిటీ కార్పొరేటర్ల సీట్లు గెలుచుకుంది వైసీపీ. దీంతో మనోహర్‌నాయుడుకి మేయర్‌గా ఛాన్స్ ఇచ్చింది పార్టీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది మార్చిలో స్థాయీ సంఘ ఎన్నికలు జరిగాయి. అందులో వైసీపీకి చెందిన 57 మందిలో కూటమికి 32 మంది కార్పొరేటర్లు మద్దతుగా నిలిచారు.

అవిశ్వాసం పెడితే నెగ్గదని గమనించిన ఆయన, తన పదవికి రాజీనామా చేశారు. పదవికి రాజీనామా చేసినా వైసీపీలో యాక్టివ్‌గానే ఉంటానని పదే పదే చెప్పుకొచ్చారు. చివరకు ఆయనపై వేటు వేసింది వైసీపీ. ఈ వ్యవహారాన్ని ఆ పార్టీ నేతలు గమనిస్తున్నారు. గుంటూరు పార్టీని అంటిపెట్టుకున్న నేతపై వేటు వేయడం సరికాదని అంటున్నారు.

అసలే నేతలు వలస పోతున్నారని, ఇలాంటి సమయంలో వేటు వేయడం సరికాదన్నది ఆ పార్టీలో కొందరి నేతల మాట. ఇలాగే కంటిన్యూ అయితే పార్టీకి గడ్డు పరిస్థితులు తప్పవని అంటున్నారు. మనోహర్ విషయంలో పార్టీ లోతుగా చేస్తే బాగుండేదని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *