నేను ఆపకుంటే భారత్, పాక్ మధ్య అణుయుద్ధం జరిగేది.. ట్రంప్ సంచలన వాఖ్యలు..

భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో తాను జోక్యం చేసుకుని అణు యుద్ధం సంభవించకుండా ఆపగలిగానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాణిజ్యపరమైన ఒత్తిడి తీసుకురావడం ద్వారానే ఇరు దేశాల మధ్య ఘర్షణలు ఆగిపోయాయని ఆయన పేర్కొన్నారు. ఆశ్చర్యకరంగా, ట్రంప్ వాదనలకు రష్యా నుంచి మద్దతు లభించగా, భారత అధికారులు మాత్రం ఈ మధ్యవర్తిత్వ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో ఈ విషయంపై తమ ఆందోళనలను నేరుగా తెలియజేశారు.

ట్రంప్ వ్యాఖ్యలు, రష్యా సమర్థన
శుక్రవారం ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడుతూ, డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. “మీకు తెలుసా, నేను ఒక పెద్ద సమస్యను పరిష్కరించాను, దాని గురించి ప్రజలు ఎక్కువగా మాట్లాడరు, నేను కూడా ఎక్కువగా చెప్పను. కానీ భారత్, పాకిస్తాన్ మధ్య అణు సమస్యను, బహుశా అణుయుద్ధాన్ని నివారించాను. నేను పాకిస్తాన్‌తో మాట్లాడాను, భారత్‌తో మాట్లాడాను, వారికి గొప్ప నాయకులు ఉన్నారు, కానీ వారు తీవ్రంగా ఘర్షణ పడుతున్నారు, అది అణుయుద్ధానికి దారితీసేది,” అని ట్రంప్ తెలిపారు.

ఘర్షణలు కొనసాగితే అమెరికాతో వాణిజ్యం నిలిపివేస్తామని హెచ్చరించిన తర్వాతే ఇరు దేశాలు దాడులు ఆపాయని ఆయన వివరించారు.

భారత్ తీవ్ర అభ్యంతరం
అయితే, అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు దౌత్యపరమైన ప్రతిఘటనకు దారితీశాయి. అమెరికాలో పర్యటిస్తున్న అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, ట్రంప్ మధ్యవర్తిత్వ వాదనలను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వద్ద నేరుగా ప్రస్తావించినట్లు తెలిపారు. “ఉపాధ్యక్షుడు వాన్స్‌తో సమావేశం అద్భుతంగా, చాలా స్పష్టంగా జరిగింది. మధ్యవర్తిత్వం అనే ఈ ప్రశ్నకు మా వైఖరిని స్పష్టంగా తెలియజేశామని నేను భావిస్తున్నాను, ఉపాధ్యక్షుడు వాన్స్ మా వాదనలను పూర్తిగా అర్థం చేసుకున్నారు,” అని థరూర్ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *