కాళేశ్వరం కమిషన్ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు ఎమ్మెల్సీ కవిత. ఆయన ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చా రని ప్రశ్నించారు. కేసీఆర్‌కు నోటీసులిస్తే.. తెలంగాణ సమాజానికి ఇచ్చినట్లేనని అన్నారు.
కాళేశ్వరం కమిషన్ కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బుధవారం ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు దిగారు కవిత. ఆమెతోపాటు తెలంగాణ జాగృతి నేతలు మాత్రమే హాజరయ్యారు. ఈ ధర్నాకు బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు దూరంగా ఉన్నారు.
కవిత ధర్నాకు వెళ్లవద్దని పార్టీ హైకమాండ్ నుంచి సంకేతాలు రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు వెనక్కి తగ్గారంటూ ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. కవిత విషయంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది తప్పుబడుతున్నారు. కేసీఆర్‌కు కమిషన్ నోటీసులు ఇచ్చారన్న కారణంతోనే ధర్నాకు దిగారని, ఇలాంటప్పుడు పార్టీ సైలెంట్‌గా ఉండడం కరెక్టు కాదని అంటున్నారు.
ఇలాంటి వ్యవహారాలకు అంతర్గత సమస్యలను ముడిపెట్టడం సరికాదని అంటున్నారు. దీనివల్ల కవిత చేసిన ఆరోపణలకు మరింత బలం వస్తుందని అంటున్నారు. బీఆర్ఎస్‌ని విలీనం చేసే అవకాశముందన్న వార్తలకు మరింత బలం చేకూరుతుందని అంటున్నారు.