అమరావతి కోసం మరోసారి ల్యాండ్‌ పూలింగ్‌ జరగబోతోందా..?

అమరావతి కోసం మరోసారి ల్యాండ్‌ పూలింగ్‌ జరగబోతోంది. 40వేల ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పూలింగ్‌లా.. అక్విజేషన్‌నా అన్నది మాత్రం ఇంకా తేల్చలేదు. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత.. స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 36వేల ఎకరాలు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నట్టు చెప్తోంది ప్రభుత్వం.

 

రాజధాని అమరావతి నిర్మాణంపై ఫోకస్‌ పెట్టిన ఏపీ ప్రభుత్వం.. హైరేంజ్‌లో ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటికే 34వేల ఎకరాలు సేకరించగా.. ఇప్పుడు మరోసారి 40వేల ఎకరాలు సేకరించబోతోంది. ఈ మేరకు CRDA అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో త్వరలోనే మరో 40వేల ఎకరాల భూమిని సమీకరించబోతున్నారు.

 

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు తరహాలో.. అమరావతిలో 5వేల ఎకరాల్లో అంతర్జాతీయ ఎయిపోర్టును నిర్మించబోతోంది. అలాగే 2వేల 500 ఎకరాల్లో స్మార్టు ఇండస్ట్రీని, మరో 2వేల 500 ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడా సిటీని నిర్మించాలని భావిస్తోంది. వీటి కోసం దాదాపు 10 వేల ఎకరాలు అవసరం అవుతాయి. ఆ భూమిని రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించింది. అయితే ల్యాండ్ పూలింగ్ చేయాలా..? లేదా అక్విజేషన్‌ ద్వారా తీసుకోవాలా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. గ్రామసభలు నిర్వహించి రైతుల అభిప్రాయం తీసుకున్న తర్వాత.. ఏ విధంగా భూమిని సేకరించాలనే దానిపై డెసిషన్‌ తీసుకోబోతోంది. ఈ బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించారు.

 

రైతులు ల్యాండ్ పూలింగ్‌కే మొగ్గుచూపుతున్నారని మంత్రి నారాయణ చెప్పారు. పూలింగ్‌ అయితే.. 40వేల ఎకరాలు సేకరించాలని.. అప్పుడే 10వేల ఎకరాలు మిగుతాయన్నారు. అక్విజేషన్‌ అయితే..10వేల ఎకరాలు సరిపోతాయన్నారు. అయితే.. రైతులకు కూడా మేలు జరగాలి కనుక.. వీలైంత వరకు ల్యాండ్‌ పూలింగ్‌కే ప్రిఫర్‌ చేస్తామని చెప్పారు మంత్రి. ఇప్పటికే 36వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చేందుకు కొందరు రైతులు ముందుకు వచ్చారని తెలిపారు.

 

ఇక.. అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో 3వేల 673 కోట్ల వ్యయంతో ఐదు అడ్మినిస్ట్రేటివ్ టవర్ల నిర్మాణానికి ఎల్-1 టెండర్లను ఖరారు చేసింది CRDA. 882కోట్లతో నిర్మించే GAD టవర్ నిర్మాణాన్ని NCC, 14 వందల 87 కోట్లతో నిర్మించే HOD 1, 2 టవర్ల నిర్మాణాన్ని షాపూర్జీ అండట్ పల్లంజీ, 13 వందల 4 కోట్లతో నిర్మించే HOD 3, 4 టవర్లను ఎల్‌ అండ్‌ టీ దక్కించుకున్నాయి. త్వరలోనే నిర్మాణ పనులు కూడా ప్రారంభంకానున్నాయి. 2014-19 మధ్య రూపొందించిన డిజైన్ల ప్రకారమే ఈ టవర్ల నిర్మాణ పనులు జరుగుతాయన్నారు మంత్రి నారాయణ.

 

మూడేళ్లలో అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతంలో అన్ని నిర్మాణాలను పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉంది ఏపీ ప్రభుత్వం. రెండో దశ ల్యాండ్ పూలింగ్‌పై కూడా మరో 15 రోజుల్లో క్లారిటీ వస్తుందని.. భూసేకరణ తర్వాత.. రాజధాని నిర్మాణం పరుగులు పెడుతుందని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *